తెలంగాణ  రాష్ట్రం త్వరలో తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ను రూపొందించనున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. అందరికీ మెరుగైన వైద్యాన్ని అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. శనివారం ఇంటర్నేషనల్ పేషంట్ సేఫ్టీ కాన్ఫరెన్స్ అండ్ ట్రాన్ఫర్మింగ్ హెల్త్ కేర్ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై సదస్సు జరిగింది. ఈ సందర్బంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ..ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు పెద్దలు.. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం "ఆరోగ్య తెలంగాణ" దిశగా అడుగులు వేస్తుందన్నారు. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని వైద్య పథకాలు  రాష్ట్రంలో అమలు అవుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామన్నారు. అంతేకాకుండా కేసీఆర్ కిట్స్ ను  సీఎం కేసీఆర్ ఆలోచన విధానంతో సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నామని తెలిపారు.



కేసీఆర్ కిట్స్ కార్యక్రమం ద్వారా గర్భిణీలకు పోషకాహారాన్నిఅందిస్తున్నామని చెప్పారు. దీనితో పేద మహిళలు పనులకు వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండి చేయూతను పొందుతున్నారని చెప్పారు. టీ - డయాగ్నొస్టిక్, టీ - డయాలసిస్ లాంటి సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ ను ప్రపంచ హెల్త్ హబ్ గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్టు మంత్రి ఈటెల తెలిపారు. రోగుల భద్రత హాస్పిటల్స్ ప్రథమ కర్తవ్యమన్నారు. ఈ సమావేశం భద్రత కోసం ఉన్న ఛాలెంజ్ లకు పరిష్కారం చూపిస్తుందన్న ఆశభావాన్ని వ్యక్తం చేశారు. మెరుగైన వైద్యం అందించడం, నాణ్యమైన సేవలు అందించడం కోసం ఇలాంటి సమావేశాలు హాస్పిటల్స్ కి మార్గనిర్దేశం చేస్తాయని మంత్రి  అభిప్రాయపడ్డారు. 




అనుకోకుండా వస్తున్న వైద్య ఖర్చులు నిరుపేద  కుటుంబాలను కుదేలు చేస్తున్నాయన్నారు. ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ ధరకు మెరుగైన చికిత్స అందిచెలా పరిశోధనలు జరగాలన్నాను. అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాపరెడ్డి  దీనికోసం రీసెర్చ్ చేయాలని మంత్రి ఈటెల కోరారు. టెక్నాలజీతో అతి తక్కువ ఖర్చుతో పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. మహిళలు నడిపే రంగం విజయవంతం అవుతుంది. మెడికల్ లో ఎక్కువమంది మహిళలు ఉంటారు. రోగులను జాగ్రత్తగా చూసుకొనేది మహిళలే.ఓపికకు మారుపేరు మహిళలు. బంగారు తెలంగాణ మాటలకు పరిమితం కాకుండా చూస్తున్నామని చెప్పారు. ఆరోగ్య తెలంగాణ, జ్ఞాన వంతమైనా తెలంగాణ అయినప్పుడే అది సాధ్యం అని నమ్మిన వాళ్ళం. అందుకోసం అలుపు లేకుండా పనిచేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్బంగా మంత్రి ఈటెలను అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఘనంగా సత్కరించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: