''ప్రతి ఏటా పడే వర్షంలో 16 శాతం భూగర్భంలోకి వెళ్లాలి. కానీ, చెన్నై వంటి పెద్ద నగరాల్లో 5 శాతం కూడా భూగర్భంలోకి వెళ్లట్లేదు.'' అంటున్నారు జలనిపుణులు.
 చండీగఢ్‌ లో ఇకపై ప్రజలు నీటిని వథా చేస్తే వారిపై రూ.2వేల జరిమానా వేస్తారు. అయినప్పటికీ వారు వినక పోతే, వారి నీటి కనెక్షన్‌ను కట్‌ చేస్తారు. ఇటీవల ఈ కొత్త రూల్‌ అక్కడ అమలులోకి వచ్చింది.
 
రుతుపవనాల రాక ఆలస్యం, వర్షపాతం తగ్గుముఖం పట్టడం, వీటి ప్రభావంతో ఉష్ణోగ్రత తారస్థాయికి చేరడం ఫలితంగా దేశంలోని నగరాలు, పల్లెల్లో భూగర్భ జలాలు వట్టిపోతున్నాయి. సంప్రదాయక నీటి వనరుల పరిరక్షణ, అడుగంటిన భూగర్భ జలాలను రీచార్జ్‌ చేయక పోవడం, అడవుల్ని, జల వ్యవస్థలను విధ్వంసం చేసే ప్రక్రియను ఆపక పోవడం వల్ల ఇదంతా జరుగుతోంది. 

గార్డియన్‌ పత్రిక రిపోర్టు ప్రకారం భారతదేశంలో వందలాది గ్రామాల్లోని కుటుంబాలకు కుటుంబాలే కాసిన్ని నీటిచుక్కల కోసం తమ ఇళ్లను ఖాళీచేసి వలస పోతున్నాయి. మహారాష్ట్ర, అహ్మద్‌ నగర్‌ జిల్లాలో కరువు ప్రభావం కారణంగా 50 వేలమంది పైగా రైతులు తమ పశువులను కాపాడుకోవడం కోసం 500 క్యాంపులకు తరలించారు. ముంబై నగరం చుట్టూ ఉన్న గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతున్నాయని వార్తలు.

ఇక కర్ణాటకలో 88 శాతం పైగా భూభాగం తీవ్రకరువుతో కునారిల్లిపోతోంది. రోజు రోజుకీ నీటి సమస్యలు ఇలా విస్తరిస్తున్న నేపథ్యంలో, జయశంకర్‌ జిల్లా, గోవిందరావు పేట సమీపంలో అడవిలో బతికే అతి సామాన్యులు, ప్రకృతిని, నేలను చెట్లను నమ్ముకొని బతికే కష్టజీవులు సంప్రదాయక జల వనరులను కాపాడుకునే తీరు మనకో పాఠం కావాలి.
 ఎండి పోయిన ఈ కుంటను గత సంవత్సరం 50 మంది గిరిజనులు పూడిక తీసి ఆ మట్టిని ఎగువన ఉన్న తమ పండ్లతోటల్లో వేశారు. గతంలో కురిసిన వానకు ఆ కుంట నిండుగా మారింది. వేసంగిలో నీళ్లకు లోటు లేకుండా పంటలు పండిస్తున్నామని మాతో సంతోషంగా చెప్పారు. అంతే కాదు ఈ నీటినే వడగట్టుకొని, వేడి చేసుకొని దాహం తీర్చుకుంటున్నారు.( photo by Shyammohan/Bussapur )


మరింత సమాచారం తెలుసుకోండి: