తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి..ఎంతో మంది నటీ, నటులకు అవకాశాలు కల్పించి వారిని తెలుగు ఇండస్ట్రీలోనే స్టారో హోదాలో నిలబెట్టిన గొప్ప దర్శకులు దాసరి నారాయణ రావు.  దర్శకత్వానికి గురువుగా నేటి తరం యువ దర్శకులకు ఆదర్శంగా నిలిచిన ఆయన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చవిచూశారు.   సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత మరియు రాజకీయనాయకుడిగా అన్నింటిలో తనదైన గొప్పతనాన్ని చాటుకున్నారు.  దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు.

ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశాడు. తెలుగు, తమిళం మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి పొందారు.  1947, మే 4న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో జన్మించాడు. దాసరిది పాలకొల్లులో అతిసామాన్యమైన కుటుంబం. మొదట్లో వీరు ఉన్నత కుటుంబీకులుగా ఉన్నా దాసరి తండ్రి,పెదనాన్నలు కలిసి పొగాకు వ్యాపారం చేసేవారు. అనుకోకుండా ఓ రోజు దీపావళి సమయంలో పొగాకు గోడౌన్‌ తగలబడిపోయింది.

అప్పట్లో ఇన్సూరెన్సులు ఉండేవి కాదు దాంతో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు. ఆ నష్టాలు వారి కుటుంబాలను చిన్నా భిన్నం చేశాయి.  దాసరి కుటుంబీకుల ముందు తరం చదువుకోలేదు..కానీ దాసరి తండ్రి మాత్రం ఆయనను ఆరవ తరగతి వరకు చదివించి ఆర్థిక స్థోమత లేక వడ్రంగి వద్ద పనికి పెట్టారు.  అప్పట్లో దాసరి నెల జీతం ఒక్క రూపాయి. ఆరో తరగతిలో ఉత్తమవిద్యార్థిగా ఆయనకు బహుమతి లభించడంతో ఓ గురువుగారు ఆయనను చేరదీసి పై చదువులు చదువుకునేందుకు సహాయ పడ్డారు.

 కళాశాలలో చదివేరోజులలో బీ.ఏ డిగ్రీతో పట్టబధ్రుడు అవటంతో పాటు దాసరి అనేక నాటకపోటీలలో కూడా పాల్గొనేవాడు. అనతి కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడి గా, నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందారు.దాసరి సినిమాలు తాతా మనవడు, స్వర్గం నరకం, మేఘసందేశం, మరియు మామగారు ఈయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. దాసరి తిసిన బొబ్బిలి పులి మరియు సర్దార్ పాపారాయుడు చిత్రాలు నందమూరి తారక రామారావు రాజకీయప్రవేశములో ప్రధానపాత్ర వహించాయి.  మామగారు, సూరిగాడు మరియు ఒసేయ్ రాములమ్మా చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు.

ఈ సినిమాలలో నటనకు దాసరి అనేక విమర్శకుల ప్రశంసలు మరియు బహుమతులు అందుకున్నాడు.పాత కాలం నాటి ఆంధ్రపత్రిక నుండి ఉత్తమ దర్శకుడిగా 6 సార్లు ఎంపిక అయ్యారు. ప్రముఖ సామాజిక సేవా సంస్థల నుండి అనేక అవార్డ్ లను పొందారు. వాటిలో కొన్ని వంశీ బెర్క్లే, కళా సాగర్, శిరోమణి ఇన్స్టిట్యుట్ మొదలైనవి.

ఫిల్మ్ ఫేర్ అవార్డును 6 సార్లు, మద్రాసు ఫిల్మ్ ఫాన్స్ అవార్డ్ ను 5 సార్లు, సినీ హెరాల్డ్ అవార్డ్ ను 10 సంవత్సరాలు వరసగాను గెల్చుకున్నారు.ఇవి కాక ఆయన నిర్మించిన చిత్రాలలో అనేకం అవార్డ్ లను గెలుచుకున్నాయి.దాసరి నారాయణరావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సికిందరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో నేడు కన్నుమూశారు.  ఆయన ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేరని తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు కన్నీటి పర్యంతం అయ్యారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: