నిరుపేద కుటుంబం. తల్లి కూలి పనికి వెళుతుంది. పని లేకపోతే పస్తులే. అయినా తన బిడ్డ మాత్రం తనలాగ కూలీ కాకూడదని భావించింది. బాగా చదివే కూతురు ఎస్‌.పవిత్ర చదువు కోసం చాలా కష్టపడింది ఆ తల్లి. ప్రైవేట్ స్కూల్ లో చదివించే స్తోమత లేకపోవటంతో.. సర్కార్ బడికే పంపించింది.

 

 10లో మంచి మార్కులు సాధించింది. ఆ తర్వాత ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ లోనే ఇంటర్ కంప్లీట్ చేసింది. మార్కులు ఎన్నో తెలుసా.. 936. బాగా చదువుకుని ఏదైనా సాధించాలన్న తపన, ప్రభుత్వ కాలేజీ లెక్చరర్ల తోడ్పాటుతో ప్రవేశపరీక్షలు రాసింది పవిత్ర.

 

ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాల్లో మంచి స్కోర్ సాధించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఎస్సీ కేటగిరీలో 2వేల 954 ర్యాంకు సాధించింది. దీంతో కౌన్సెలింగ్‌ లో ఈ విద్యార్థినికి.. ఐఐటీ ధన్ బాద్ లో సీటు లభించింది. జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) జూన్ 27 ఈ విషయాన్ని ప్రకటించింది.

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీడియెట్‌ చదివింది పవిత్ర. తల్లి ధనలక్ష్మి రోజూ కూలీ. పవిత్ర ఎలాంటి కోచింగ్‌ తీసుకోలేదు. అందుబాటులో ఉన్న పుస్తకాలు, లెక్చరర్ల సూచనలు, సలహాలతోనే కష్టపడి ర్యాంక్ సాధించింది. ఐఐటీ సీటు సాధించింది. పవిత్రకు కాలేజీ ప్రిన్సిపాల్, లెక్చరర్లతోపాటు అధ్యాపకుల సంఘం అభినందనలు తెలిపింది. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలకు సర్కార్ బడులు ఏ మాత్రం తీసిపోవని.. కష్టపడి చదువుకోవాలనే తపన ఉంటే చాలంటున్నారు లెక్చరర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: