ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలను అవలీలగా అధిరోహించి రికార్డు సృష్టించాడు హైదరాబాద్ కాప్. ఇండియా నుంచి ఈ పర్వతాన్ని ఆధిరోహించిన రెండో వ్యక్తిగా రికార్డులోకి ఎక్కాడు ఈ పోలీస్ ఆఫీసర్. ప్రతికూల పరిస్దితులను ఎదురించి ఇండోనేషియాలోని పర్వతాన్ని ఎక్కగలిగాడు ఐపీఎస్ అధికారి తరుణ్ జొషీ.

డాక్టర్‌ తరుణ్‌జోషి.. హైదరాబాద్‌ పోలీసు విభాగంలో సుపరిచితమైన పేరు. ఎంబీబీఎస్‌, హౌస్‌సర్జన్‌ చేసి ఆ తర్వాత పోలీసు కొలువులో చేరారు. గతంలో రాచకొండ జాయింట్ కమిషనర్‌, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో డీసీపీగా, ఆదిలాబాద్‌ ఎస్పీగా, ఎల్బీనగర్‌ డీసీపీగా విధులు నిర్వహిస్తూ తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో స్పెషల్ జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. అయితే పర్వతారోహణ ఆయనకున్న మరో అభిరుచి అంతా ఇంతా కాదు. ఆరేళ్ల క్రితం ఉత్తరాఖండ్‌లో సంభవించిన వరదల్లో తెలుగువారిని రక్షించేందుకు బృందానికి నాయకుడిగా ప్రభుత్వం ఆయనను పంపడానికి కూడా కారణం అదే. బద్రీనాథ్‌లో వరదల్లో చిక్కుకున్న ఎంతోమంది తెలుగువారిని రక్షించడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించాడు. అయితే ఆయన అభిరుచి ఇంకా తగ్గలేదు. ఇటీవలే ప్రపంచంలోనే ఎత్తైన మంచు పర్వతాల్లో ఒకటైన కార్స్‌టెన్జ్‌ను అధిరోహించారు. 4 వేల 8 వందల 84 మీటర్ల ఎత్తున్న ఈ పర్వత శిఖరాగ్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవం రోజు తెల్లవారుజామున ఒంటి గంట పదిహేను నిమిషాలకు అధిరోహించారు డాక్టర్ తరుణ్ జోషీ. ఇండోనేషియాలోని పపువా ద్వీపంలో ఉంది ఈ పర్వతం. మంచు, రాళ్లతో కూడిన ఈ పర్వతాన్ని ఎక్కిన రెండో భారతీయుడిగా కూడా రికార్డ్ సాధించారు తరుణ్‌జోషి. 

ఈ పర్వతం బేస్‌క్యాంప్‌ వరకూ సులభంగా వెళ్లగలిగినా.. శిఖరాగ్రానికి చేరాలంటే ఇనుప తీగల ఆధారంగానే వెళ్లాలి. ఎవరెస్ట్‌, కాంచనగంగ, కిలిమంజారో లాంటి ఎత్తైన మంచు పర్వతాలను అధిరోహించే పర్వతారోహకులు కూడా కార్స్‌టెన్జ్‌ శిఖరాగ్రం చేరుకునేందుకు చాలా శ్రమిస్తారు. ఎందుకంటే 3 వందల మీటర్ల దూరంలో పర్వతం రెండు భాగాలుగా ఉంటుంది. అలాంటి   పర్వతాన్ని ఎక్కేందుకు తొమ్మిది మందితో కూడిన బృందం వేర్వేరు దేశాల నుంచి ఈనెల 3న ఇండోనేషియాకు చేరుకుంది. ఈ బృందంలో డాక్టర్‌ తరుణ్‌ జోషి ఒక్కరే భారతీయుడు. 4 వ తేదీ సాయంత్రానికి పర్వతాన్ని అధిరోహించవచ్చనుకున్నారు. అయితే అంతలోనే భారీ వర్షం మొదలైంది. దీంతో.. భారీగా మంచు మార్గాన్ని కప్పేసింది. వాయిదా పడిన పర్వతం ఎక్కాలనే కసితో.. 9 రోజుల పాటు వీరి బృందం బేస్‌ క్యాంప్‌లోనే ఉండిపోయింది. నిపుణుల సూచనలు తీసుకొని 14వ తేదీ సాయంత్రం పర్వతారోహణ మొదలెట్టారు. ఏకబిగిన 14 గంటలపాటు పర్వతాన్ని ఎక్కిన తరుణ్‌ జోషి బృందం శిఖరాగ్రాన్ని చేరుకుంది. కొద్దిగంటలు శిఖరాగ్రంపై ఉన్న బృందం సభ్యులు విజయోత్సాహాన్ని సహచరులతో పంచుకున్నారు. అనంతరం అక్కడి నుంచి 8 గంటల్లో తిరిగి బేస్‌క్యాంప్‌ను చేరుకున్నారు. మొత్తం మీద పెద్ద సవాలే అయినా.. మంచు పర్వతాన్ని అధిరోహించారు హైదరాబాద్ పోలీస్. 




మరింత సమాచారం తెలుసుకోండి: