శాంతి తో సమస్యలను పరిష్కారం చెయ్యడం అంత సులువు కాదు అందుకే అలా శాంతితో ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి పురస్కారం ఈ ఏడాది ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్‌ అలీని వరించింది. ఆఫ్రికా దేశంలో శాంతి స్థాపన, అంతర్జాతీయ సహకారంలో ఆయన చేసిన కృషికిగాను ఈ అవార్డు దక్కింది. ప్రధానంగా ఇథియోపియాకు సరిహద్దుల్లో ఉన్న ఎరిట్రియా దేశంతో దశాబ్దాల తరబడి నెలకొని ఉన్న సరిహద్దు ఉద్రిక్తతల్ని నివారించడానికి శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంలో అబీ అహ్మద్‌ చూపించిన చొరవకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రకటిస్తున్నట్టుగా ఓస్లోలో నార్వే నోబెల్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రకటించింది.

ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తికి అత్యున్నత పురస్కారం రావడం ఇదే మొదటిసారి. 43 ఏళ్ల అబీ నోబెల్‌ పురస్కారం పొందిన 100వ విజేత. ఈ పురస్కారం కింద 90 లక్షల స్వీడిష్‌ క్రౌన్స్‌ (దాదాపు రూ.9.40 కోట్లు) అబీ అహ్మద్‌కు అందజేస్తారు. ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ వర్ధంతిని పురస్కరించుకొని డిసెంబర్‌ 10న నార్వేలోని ఓస్లోలో శాంతి పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. స్వీడన్‌ పర్యావరణ ఉద్యమకారిణి, 16 ఏళ్ల వయసున్న గ్రేటా థెన్‌బర్గ్‌ రేసులో ముందున్నారు. ఆమెకే అవార్డు వరిస్తుందని అందరూ భావించారు. కానీ చివరి నిమిషంలో అబీ అవార్డును గెల్చుకున్నారు.

20 ఏళ్ల సంక్షోభానికి తెర
ఒకప్పుడు ఇథియోపియాలో భాగమైన ఎరిట్రియా సుదీర్ఘ పోరాటం చేసి 1993లో స్వతంత్ర దేశంగా అవతరించింది. అప్పట్నుంచి ఆ రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యలు ఉన్నాయి. అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంగిస్తు చేస్తూ ఎరిట్రియా 1998లో ఇథియోపియాపై సమరభేరి మోగించింది. 1998–2000 మధ్య భీకర పోరులో చివరికి ఎరిట్రియా వెనక్కి తగ్గింది. అప్పట్నుంచి ఉద్రిక్తతలు చెలరేగుతూనే ఉన్నాయి. 2018లో అబీ అహ్మద్‌ ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టాక ఎరిట్రియా అధ్యక్షుడు ఇసాయిస్‌ అఫ్వెర్కికు స్నేహహస్తం అందించారు.
మూడు నెలల్లోనే ఉద్రిక్తతల్ని చల్లార్చడానికి శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.ఇలా యుద్ధాలకు బై.. బై...చెప్పి శాంతితో విజయం పొందారు కాబట్టే నోబెల్ అవార్డ్ దక్కింది,స్నేహం దక్కింది,మంచి పేరు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: