పిల్లల చదువుల విషయంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతఉందో  తల్లిదండ్రుల పాత్ర కూడా అంతే ఉంది. పిల్లలే చదువుకుంటారులే అని వదిలేయకూడదు.  ఇంతకుముందుకు, ఇప్పటికీ పిల్లల చదువుల్లో ఎంతో మార్పు వచ్చింది.అప్పుడు ఒక్క తెలుగు మీడియం మాత్రమే స్కూల్స్ లో చెప్పేవారు. ఇప్పుడు అందరు ఇంగ్లీష్ మీడియంనే.  అందువలన తల్లిదండ్రులకు, పిల్లల చిన్న వయస్సునుండే ఎక్కువ బాధ్యత తీసుకోవలసిన అవసరం ఏర్పడింది.

 

పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, కొంచం శ్రద్ధ వహించాలి. పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు తగిన శ్రద్ధ వహించి, వారిచేత చదివించటం, హోంవర్కు చేయించటం చేయాలి. అంతేకాని దగ్గరుండి ప్రతీదీ మీరే చేయకూడదు. దానివలన పిల్లలకు లాభంకంటే నష్టం ఎక్కువ.పిల్లలు ఏకాగ్రతగా చదువుకోవటానికి ఇంటివాతావరణం దోహదం చేసేట్లుగా చూడాలి.కొంతమంది పిల్లలు కొన్ని సబ్జక్ట్స్ లో వీక్ గా ఉంటారు. చదవటానికి కష్టపడుతుంటారు.

 

వారికి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించి, తగిన శిక్షణ ఇవ్వాలి. అంతేకాని వారిని కించపరిచి, హేళన చేయకూడదు. అలా చేస్తే వారు ఒంటరితనానికి  లోనవుతారు.  ఏ సబ్జెక్టు  అయితే చదవలేకపోతున్నారో దానికి సంబంధించి ట్యూషన్ పెట్టాలి. తల్లి తండ్రులు ప్రోత్సహించాలి. చిన్నప్పటినుంచి పిల్లలకు చదువే లోకంలా కాకుండా,  లోక జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలను చదివే అలవాటు చేయాలి,అలాగే  వివిధ ప్రదేశాలకు తీసుకువెళ్ళాలి.చదివిన దానికంటే చుసిన దాని పిల్లలు ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు. పిల్లల పాఠశాలలకు వెళ్ళి, వారి ఉపాధ్యాయులను కలిసి,వారి అభిప్రాయాలను తెలుసుకుని చర్చించాలి.

 

 

పిల్లలు ఎలా చదువుతున్నారని ఆరా తీయాలి. పేరెంట్స్ మీటింగ్ కి వెళ్తూ ఉండాలి. పిల్లలు ఏదైనా ఒక విషయంలో విశేషమైన ప్రతిభ కనబరిచినపుడు వారిని తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహించాలి. అప్పుడు వారికి శక్తి సామర్థ్యాలు,ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.ముఖ్యంగా పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులు లింగబేధాలను, పక్షపాత వైఖరిని చూపకూడదు,అమ్మాయిలను అబ్బాయిలతో సమానంగా చదివించాలి.చదువుతోపాటు పిల్లలకు ఆటలు, వ్యాయామం కూడా అవసరమే. ఆటల వలన పిల్లల దేహాభివృద్ధి,మానసికాభివృద్ధి పెంపొందుతాయి.

 

మన చేతివేళ్ళన్నీ ఒకలాగే ఉండనట్లే, మన పిల్లలంతా ఒకలాగే ఉండరు, అయినా తల్లిదండ్రులు సమానంగా చూస్తూ చదివించినట్లయితే పిల్లలు చక్కగా చదివి, మంచి పేరు తెచ్చుకుంటారు.కనుక చిన్నతనంలో పిల్లలకు ఇచ్చే శిక్షణపైనే వారి భావి జీవితం ఆధారపడి ఉంటుందన్న విషయం తల్లిదండ్రులు గ్రహించాలి. పిల్లలకు ఏది ఇష్టం అయితే అదే చదివించండి. మీ ఇష్టాలని వాళ్లపై రుద్దకండి..వాళ్ళకి నచ్చింది చేస్తేనే వాళ్ళు ఆనందంగా ఉంటారు. వారు చేసే దానిలో మీకు తప్పు కనిపిస్తే సున్నితంగా వాళ్ళకి అర్ధం అయ్యేలా చెప్పండి. వింటారు అంతేగాని పసి హృదయాల్ని గాయం చేయకండి. పెద్దయ్యాక మొండిగా తయారవుతారు. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: