పిల్లల కోసం ప్రతి తల్లిదండ్రులు పడుతున్న తపన ఒక్కటే మంచి మార్గంలో ముందుకు వెళ్లడం.అలాగని గట్టిగా మందలిస్తే మనసులో పెట్టేసుకుని ఏదన్నా అఘాయిత్యం చేసుకుంటారో  అని భయము .అలా మందలించి లేదు అంటే ఏమైపోతారో ఎటు చెడు దారి పడతారు అని భయం .ఏదిఏమైనప్పటికీ సున్నితంగా వారికి అర్థమయ్యే రీతిలో మనము చెప్పి వారిని ఒక మంచి దారికి తీసుకురావడమే తల్లిదండ్రుల యొక్క బాధ్యత.  అమ్మాయిల విషయంలో తల్లి మాత్రమే ప్రముఖ పాత్ర తీసుకోవాలి .ప్రతి తల్లి కూడా కూతురు గురించి చాలా కలలు కంటుంది.  చిన్నపుడు మనతో అన్ని పంచుకునే అమ్మాయి,  టీనేజ్ లోకి వచ్చాక  మా అమ్మాయి  ప్రవర్తన మారిపోయింది అని  ప్రతి తల్లి అనుకుంటుంది. 

 

 

 చిన్నప్పటి నుంచీ  స్కూల్‌ నుంచి రాగానే నాతో గడపడమే అలవాటు. నాతో కబుర్లు చెప్పేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇంటికి వచ్చేయగానే, ఫోన్‌ పట్టుకుంటుంది. ఛాట్‌ చేస్తూ కూర్చుంటుంది. లేకపోతే, ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. పక్కనున్న నాకే వినపడనంత రహస్యంగా సంభాషిస్తుంది. మా అమ్మాయి ప్రవర్తన లో మార్పు వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటారు.  మా అమ్మాయిలోనే ఏదైనా లోపం ఉందా? అని కలవరపడతారు. కానీ మీరు అంతా కంగారు పడవలిసిన పని లేదు. చిన్నప్పుడు ప్రతి అమ్మాయీ తనకు అమ్మే బెస్ట్‌ ఫ్రెండ్‌ అనుకుంటుంది. అమ్మతోనే ఎక్కువగా గడుపుతుంది. మీ అమ్మాయీ అంతే. తనిప్పుడు కాలేజీకి వచ్చింది. స్కూల్లో కన్నా కాలేజీలో స్వేచ్ఛ ఎక్కువ. స్నేహితులూ ఎక్కువే. అలాగే వయసు ప్రభావం వల్ల వాళ్లు మాట్లాడుకునే విషయాలు మారిపోతాయి. కాబట్టి, అమ్మతో కాకుండా స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. ఎక్కువ సేపు మాట్లాడతారు. ఫోన్లలో గుసగుసలు కూడా అందుకే. ఇందులో మీరు భయపడాల్సిందేం లేదు. టీనేజ్‌ పిల్లలంతా ఇలాగే ఉంటారు.

 

కాకపోతే తనని మీరు పూర్తిగా విడిచిపెట్టకుండా, ఏదో రకంగా తనతో మాటలు కలుపుతూ ఉండండి. కొంత సమయం గడుపుతూ ఉండండి. కాలేజీలో ఏం జరుగుతోందన్నది స్నేహితురాలిగా తెలుసుకుంటూ ఉండండి. కలిసి భోంచేయండి. కలిసి బయటికెళ్లండి. మిమ్మల్ని తాను పూర్తిగా నమ్మగలిగేంత విశ్వాసం కలిగించండి. అప్పుడు మీ అమ్మాయి దారి తప్పే ఛాన్సే ఉండదు. టీనేజ్ అనేది తెలిసీ తెలియని వయసు. అంతేకాదు..ఉద్వేగం తో పాటుగా ప్రకృతి ధర్మాల్లో ఒకటైన లైంగిక ఉద్రేకాలకు సంబంధించిన హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అయ్యే వయసు. అందుకే పెడసరి మార్గాలు పట్టే ప్రమాదం కూడా ఉంటుంది. ఎవరయినా వారిని తమవైపు ఆకర్షితులుగా మార్చుకునే అవకాశాలూ ఉంటాయి.

 

 

ఈ క్రమంలోనే ఆకర్షణలనే ప్రేమలుగా భ్రమపడి దారితప్పే ముప్పు ఉంటుంది..ప్రేమ అని మోసపోయే అవకాశాలు ఎక్కువ.   వారి కార్యకలాపాలను ఓ స్నేహితుడిలా తెలుసుకుని గైడెన్స్ ఇచ్చే ప్రయత్నమూ మానకూడదు.ప్రతి తల్లిదండ్రులు కూడా వారి కార్యకలాపాలు ఉద్యోగ ప్రయత్నాలు సంపాదన డబ్బు మీదే కాకుండా పిల్లల మీద కూడా దృష్టి పెట్టి వారికి కూడా కొంత సమయాన్ని కేటాయించాలి . అమ్మాయిలు ఉన్న ఇంట్లో అమ్మాయిల విషయంలో ప్రతి తల్లి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: