మధ్యతరగతికి చెందిన తల్లిదండ్రుల్లో చాలామంది తామేదో సంపన్న వర్గానికి చెందినట్లుగా భావిస్తూ పిల్లల పెంపకంలో లేనిపోని ఆడంబరాలకు పోతుంటారు. చిన్నారుల పుట్టినరోజు వేడుకల పేరిట  మితి మిరిన ఖర్చు చేస్తుంటారు. పిల్లలు అడిగినవన్నీ కొని ఇస్తుంటారు. అంతగా అవసరం లేకున్నా అప్పు చేసి మరీ ఖరీదైన బట్టలు, ఆటవస్తువులు కొని పెడుతుంటారు. అలా కొన్న ఖరీదైన బట్టలు ఓ ఆరునెలలు తిరిగేసరికి ఆ పిల్లలకు పొట్టిగా అయిపోతే పక్కన పడేస్తుంటారు. మంచి ఆదాయం కలిగి, ఆర్థికంగా స్థితిమంతులైన వారికి మాత్రమే ఆడంబరాలు చెల్లుబాటు అవుతాయి తప్ప, నెల జీతంతో బొటాబొటిగా సరిపుచ్చుకునే సగటు కుటుంబాలకు ఇలాంటి ఆర్భాటాలు నప్పవు.

 

బర్త్‌డే అని, న్యూ ఇయర్ వేడుకలని ప్రతి సందర్భంలోనూ కొత్త బట్టలు కొనడం, విందులు, వినోదాలకు విలాసవంతమైన హోటళ్లకు పిల్లలను తీసుకువెళ్లడం పేరిట కొందరు పేరెంట్స్ పదిమందిలో గొప్ప కోసం హడావుడి చేస్తుంటారు. పిల్లల సొంతోషం కోసమేగా చేసేది అని కొందరు అనుకోవచ్చు.. అది నిజమే కానీ వాళ్ళు  పిల్లలు, తెలిసి తెలియని వయసు. పిల్లలకు తెలియని వయసులో  వాళ్ళు అడగకపోయినా తేవడం, సెలెబ్రేషన్స్ చేయడం లాంటివి చేసారు.

 

మరి పిల్లలు పెద్దవాళ్ళు అయి అడిగినపుడు ఇవ్వలేని స్థితి.. అందుకే స్థాయి కి తగ్గట్టు ఉండాలి. ఉన్నదాంట్లో సరిపెట్టుకుని పోవాలి. ఇక టీవీ చానళ్లు, సినిమాలు చూసి పిల్లలు వింత అలవాట్లకు, విపరీతమైన కోరికలకు పోకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. చదువు విషయంలోనూ తాహతుకు మించి ఖర్చు చేస్తే ఆర్థిక సమస్యలు వెంటాడక తప్పదు. చిన్నారులకు మంచి విద్యాబుద్ధులు నేర్పించాలనుకోవడంలో తప్పులేదు. కానీ, భారీగా డొనేషన్లు చెల్లించి కార్పొరేట్ స్కూళ్ల వైపు మొగ్గు చూపడం మంచిది కాదు. ప్రభుత్వ బడుల్లో చేర్పించినప్పటికీ పిల్లలపై వ్యక్తిగత శ్రద్ధ చూపితే వారు చదువులో రాణిస్తారు.  ఫీజులు కట్టని పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో వేధించడం ఇటీవల పరిపాటిగా మారింది. స్కూల్ ఫీజులే కాదు, పిల్లల ఇతర అవసరాలు తీరాలంటే భారీగా డబ్బు అవసరం ఉంటుందని పేరెంట్స్ ముందుగానే గ్రహించాలి.

 

 

లేనిపోని సరదాల కారణంగా పిల్లలు చదువుపై దృష్టి సారించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నదాంతోనే సంతృప్తి చెందుతూ పిల్లల పెంపకం పట్ల తల్లిదండ్రులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకునే ఆత్మవిశ్వాసాన్ని చిన్నారుల్లో కలిగించాలి. చదువుపైనే వారు దృష్టి కేంద్రీకరించాలంటే ఆడంబరాలకు స్వస్తి పలకాలి. ఇక, కొందరు చాదస్తపు తల్లిదండ్రులుంటారు. అతి క్రమశిక్షణ పేరిట పిల్లలను అన్ని విషయాల్లోనూ కట్టడి చేస్తుంటారు. తగిన స్వేచ్ఛ లేని చిన్నారులు మానసిక సమస్యలకు లోనయ్యే ప్రమాదం ఉంది. ఆర్థికంగా బాగున్నవారు పిల్లల అవసరాలను తీర్చడంలో తప్పులేదు. అలా అని వారిని విలాసాలకు, విపరీత పోకడలకు అలవాటు చేయకూడదు. ఎప్పటికప్పుడు ఆర్థిక పరిస్థితులను గుర్తుచేసుకుంటూ వారి పెంపకంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి: