పసిపిల్లలకు ఏ దశలో ఇవ్వాల్సిన ఆహారం ఆ దశలో ఇవ్వాలి. పసిబిడ్డల సంరక్షణ గూర్చి మనకు తరతరాలుగా అలవాటైనప్పటికీ ఇప్పటికీ బోలెడు అనుమానాలు ఉన్నాయి. తల్లిపాలు ఇవ్వడం నుంచి మొదలు పెడితే ఉగ్గు పెట్టే వరకు అనేక అపోహలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ కారణంగానే చాలామంది చిన్న పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఆరోగ్య సమాజాన్ని నిర్మించడానికి పిల్లల్లో మంచి ఆహారపు అలవాట్లు కూడా ఉండాలి. పిల్లలు చాలామంది పొట్టిగా ఉంటున్నారు. 

 


బిడ్డ పుట్టగానే తల్లిపాలు ఇవ్వాలి. తొలి ఆరు నెలలు  తల్లిపాలు తప్పితే మరే పాలు పట్టకూడదు. పోతపాలు అత్యవసర సమయాల్లో మాత్రమే పట్టాలి. ఇతర ఆహారపదార్థాలు తినిపించాల్సిన పనిలేదు.ఆరు నెలల  తర్వాత తప్పకుండా ఆహార పదార్థాలను తినిపించాలి. ఆరునెలలలోపు తల్లిపాలు పట్టిన తర్వాత ప్రత్యేకంగా మంచినీళ్లు త్రాగించాల్సిన అవసరం ఉండదు. పిల్లలకు సమతులహారం తప్పనిసరి. ఎదుగుదల మాత్రమే కాదు వ్యాధులు రాకుండా ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది.
అపోహలు వద్దు
చాలామంది తల్లిదండ్రులు ఆరునెలలు దాటినప్పటికీ ఆవు లేదా గేదె పాలను పట్టిస్తారు.

 

దీనివల్ల ఐరన్‌ లోపం వస్తుంది. పాలల్లో ఐరన్‌ శాతం తక్కువగా ఉండటంతో సరిపడా ఐరన్‌ పిల్లలకు అందదు. ఫలితంగా రక్తహీనత ఏర్పడుతుంది. పాలు సమతులహారం అయినప్పటికీ కొన్ని ఖనిజ లవణాలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల పిల్లల ఎదుగుదల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. పిల్లల్లో విరోచనాలు రాగానే చాలామంది తల్లులు పాలను పట్టడం ఆపేస్తారు. దీనివల్ల పిల్లలకు పోషకాలు
అందవు. బరువు తగ్గుతారు. సన్నగా మారతారు. విరోచనాలు పెట్టగానే తిండిని ఆపేయడం వల్ల పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి మరింత తగ్గిపోతుంది.
 సహజసిద్ద ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. 
తాజా ఆహారం పెట్టాలి ఎప్పటికప్పుడు. 
బిడ్డకు తినిపించే ఆహారం తాజాగా, వేడిగా ఉండాలి. వండిన తర్వాత రెండు గంటల్లోపే తినిపించాలి. చేతులను పరిశుభ్రంగా కడిగి తినిపించాలి. పిల్లలు ఆహారం స్వీకరించే ముందే సబ్బుతో చేతులను శుభ్రంగా కడిగే అలవాటు చేయాలి. మీజిల్స్‌ టీకాతో పాటు విటమిన్‌ – ఎ ఇప్పించాలి. ఏడాది తర్వాత ఆర్నెళ్లకోసారి పొట్టలో పురుగులుంటే పోయేందుకు ‘అల్బెండజాల్‌’ ఒక చెంచా మందు పట్టాలి. ఇలా బిడ్డకు ఐదేళ్లు వచ్చే వరకు పట్టటం మంచిది. ఇది మురికివాడల్లో, అపరిశుభ్ర వాతావరణంలో ఉండేవారికి మరీ తప్పనిసరి.

మరింత సమాచారం తెలుసుకోండి: