పూర్వకాలం లో ఒకానొక కుగ్రామం లో ఒక గడ్డల డాక్టర్ గారు ఉండేవారు.  గడ్డల డాక్టర్ అనగా వంటినిండా గడ్డలు ఉండేవాడు అని కాదు అర్ధం.  చుట్టుపక్కల గ్రామాలలో ఎవరికైనా దేహం మీద సెగ గడ్డలు, కణుతులు  లాంటివి లేచినపుడు, ఈ డాక్టరు గారు వాటిని కత్తితో సునాయాసం గా కోసిపారేసేవారు.  ఆ రోజుల్లో నేటిలా మత్తు మందులు ఇవ్వడం లేవు.  రోగిని మంచం మీద పడుకోబెట్టి ఇద్దరు సహాయకులు అతడి చేతులు కాళ్ళు తొక్కి పట్టి ఉంచగా డాక్టర్ గారు పదునైన కత్తితో మొదలంటా కోసేవారు.  ఆ సమయం లో ఆ రోగి అరిచే అరుపులు ఆమడ దూరం వినిపిస్తుండేవి.  డాక్టర్ గారు నవ్వుతూ "ఎం ఫర్వాలేదు.. రెండు నిముషాల్లో కోస్తా... పెద్ద బాధ ఉండదు... కొంచెంసేపు నొప్పి ఉంటుంది.  ఓర్చుకోవాలి.  మహా అయితే ఓ యాభై రోజులు లేవలేవు.  విశ్రాంతి  తీసుకో"  అంటూ కోసేవారు.  


అక్కడ చూస్తున్నవారు అందరూ డాక్టర్ గారి శస్త్రవిద్యా నైపుణ్యాన్ని తెగ మెచ్చుకునే వారు.  "ఆహా ఏమి కోశాడు...  నెప్పి  తెలియలేదు.. వాడు భయం తో ఏడుస్తున్నాడు తప్ప నెప్పితో కాదు.. మహా గొప్ప డాక్టరు గారు"  అని ప్రశంసిస్తుండే వారు.  అలా గడ్డలు కోయించుకున్న రోగులలో    నూటికి  90  మంది అమరలోకానికి పయనమవ్వగా.. పది మంది బతికి బట్టకట్టి జీవితాంతం మంచం లో పడిఉండేవారు.  అయితేనేం.. ప్రాణం ఉందిగా బొందిలో అని తృప్తి పడేవారు.  


(నా చిన్నతనం లో కొందరు నాటువైద్యులు మూలశంక రోగులను ఊరిబయట ఏ చెట్టు నీడనో   వంగోబెట్టి పైల్స్ ను కోసే దృశ్యాలను చూసాను అని మనవి. కోయించుకునే  వాళ్ళు వాయో.. వామ్మో... అని పెద్దగా అరుస్తుండే వారు.   కోసేవాడు మాత్రం "  ఏం కాదు లేహే"  అంటుండేవాడు నవ్వుతూ...)  
  అయితే కాలం ఎప్పుడూ ఒకేతీరున ఉండదు కదా?  


సదరు డాక్టర్ గారికి కొన్ని ఏళ్ళతరువాత నడుము మీద సెగగడ్డ పొంగింది.  పడుకోడానికి వీలు లేక నెప్పితో అల్లాడిపోయేవారు.  ఇక భరించలేక ఆ గడ్డను కోసేయ్యమని తన సహాయకుడిని కోరారు.  గురువుకే వైద్యం చేసే మహత్తర అవకాశం వచ్చిందని సంతోషించి ఒక శిష్యాగ్రణి డాక్టర్ గారిని బోర్లా పడుకోబెట్టి గడ్డను కసుక్కున కోసి పారేసాడు.  అప్పుడు ఆ డాక్టర్ గారికి అండపిండాలు కదిలిపోయి  అరిచిన అరుపులు ఆకాశంలో కూడా ప్రతిధ్వనించాయి.  "వేలాది గడ్డలు కోశాను... గడ్డ కొస్తుంటే ఇంత నెప్పి పుడుతుందా? "  అంటూ డాక్టర్ గారు బండబూతులు ఆరున్నొక రాగం లో ఆలపిస్తుంటే సమీపం లోని పర్వతాలు కూడా చలించిపోయాయి.  


అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని నిర్దాక్షిణ్యంగా గొంతు నొక్కిన చంద్రబాబు కు ప్రతిపక్ష నేత కాగానే ప్రజాస్వామ్యం విలువల గూర్చి  చెప్పడం చూస్తుంటే పై కథ గుర్తుకు వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: