హైదరాబాద్‌లోని చార్మినార్‌తోపాటు చారిత్రక కట్టడాల దగ్గరకు వెళ్లితే.. వందలు వేల సంఖ్యలో పావురాలు అటూ ఇటూ రివ్వున  ఎగురుతూ కనిపిస్తాయి. ఇకపై ఆయా ప్రదేశాల్లో పావురాలు కనిపించకపోవచ్చు. వాటిని హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం తీసుకెళ్లి.. నల్లమల అడవుల్లో వదిలేస్తున్నారు అధికారులు. పావురాల వల్ల 15 రకాల వ్యాధులు వస్తున్నాయని ఈ చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌కు కొత్తగా వచ్చే వారు ఇక్కడి పావురాలను ఆసక్తిగా చూస్తారు. స్థానికులకు మాత్రం వీటితో నిత్యం సమస్యలే.  ప్రతీ వీధిలో, అపార్ట్‌మెంట్‌లో, ఇళ్ల కన్నాల్లో ఎక్కడ చూసినా కనిపిస్తాయ్‌. ప్రతీ ఏటా వీటి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. 


పావురాలు చూడటానికి బాగానే ఉంటాయి కానీ... వాటి వల్ల వచ్చే వ్యాధులు, వ్యాపించే వైరస్‌లను అడ్డుకోవడం మన వల్ల కావట్లేదు. పైగా వాటి వల్ల చారిత్రక కట్టడాలు పాడైపోతున్నాయి. ఆ కట్టడాల్ని చూసేందుకు వచ్చే పర్యాటకులు... అసహ్యంగా ఉంటున్నాయని ఫీలవుతున్నారు. అందుకే... ఎలాగైనా ఈ సమస్యలకు చెక్ పెట్టాలనుకున్న జి.హెచ్.ఎం.సి పావురాల్ని శ్రీశైలం అడవుల్లోకి తరలించాలని డిసైడ్ అయింది. ముందుగా 500 పావురాల్ని మొజాంజాహీ మార్కెట్ ప్రాంతంలో పట్టుకొని... శ్రీశైలం అడవుల్లోకి తీసుకెళ్లి వదిలేసింది. పావురాల్ని అంత దూరంలో వదిలేశాం కదా అని ప్రశాంతంగా ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే పావురాలకు... ఈ భూమిపై ఎక్కడ వదిలినా... తిరిగి వాటి గమ్యస్థానానికి వచ్చేయగలిగే గ్రాహక శక్తి ఉంటుంది. అందువల్ల అవి తిరిగి మొజాంజాహీ మార్కెట్‌కి వచ్చేసే అవకాశాలున్నాయి. నిజానికి పావురాలకు మనుషుల మధ్య ఉండటం చాలా ఇష్టం. ఎందుకంటే... ఇవి ఆహారం కోసం వేటాడేందుకు ఏమాత్రం ఇష్టపడవు. ఎక్కడైనా ఫ్రీగా ఆహారం దొరికితే చాలని ఎదురుచూసే రకం. పైగా వీటి శరీర బరువు ఎక్కువ కాబట్టి... ఎక్కువ సేపు ఎగరలేవు. అందుకే... ప్రజల మధ్యే ఉంటూ... వాళ్లు వేసే గింజలు తింటూ... హాయిగా ఉంటున్నాయి. కానీ... ఇబ్బంది పడుతుంది ప్రజలే.


హైదరాబాద్‍‌లో పావురాలు 15 రకాల వ్యాధులు వ్యాపించేందుకు కారణం అవుతున్నట్లు పరిశోధనలో తెలిందని అధికారులు అంటున్నారు. పావురాలకు రకరకాల వ్యాధులుండటంతో అవి గాల్లో ఎగురుతుంటే... వైరస్ ప్రజలకు చేరుతోంది దీంతో ప్రజలు ఎక్కువగా శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నారు. పావురాల రెక్కలు, ఈకలు, రెట్టలు అన్నీ మనుషులకు ప్రమాదకరమే. ప్రజలకు చర్మం, నోరు, పొట్ట దెబ్బతింటాయి. తలనొప్పితో పాటు ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయి. వీటితో పాటు పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. స్వైన్ ఫ్లూ కూడా వచ్చేలా ఉంది. చాలా దేశాల్లో పావురాల పెంపకంపై నిషేధం ఉంది. కొన్ని చోట్ల ఫైన్లు వేస్తున్నారు. హైదరాబాద్‌లో 560 చోట్ల పావురాల్ని పెంచుతున్నారు. చాలా ప్రదేశాల్లో దాణాలు వేస్తున్నారు. ఇలా పావురాల్ని పెంచవద్దనీ, వాటికి ఆహారం వెయ్యవద్దనీ జి.హెచ్.ఎం.సి అధికారులు కోరుతున్నారు. మరీ ఈ పావురాల తరలింపు ఎంత వరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: