సాధారణంగా గ్రామం అంతే  పచ్చని పైర్లు.. చుట్టూ వందల మంది జనాలతో కళకళలాడుతూ ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లోని ఒక గ్రామం మాత్రం నిర్మానుష్యంగా మారింది. జమ్మలమడుగు మండలం పొన్నతోట పంచాయితీ కిందకు వచ్చే దప్పెర్ల గ్రామం. ఈ గ్రామంలో ఇళ్లు చాలానే ఉన్నా ఆ ఇళ్లలో జనాలు ఉండరు. గతంలో దాదాపుగా 600 మంది జనాబా ఉన్న ఆ ఊర్లో ఇప్పుడు కేవలం ఒకే ఒక్క వృద్దుడు జీవిస్తున్నాడు. ఎందుకు ఈ గ్రామం మొత్తం ఖాళీ అయిపోయింది? అన్న ప్ర‌శ్న రాక మాన‌దు. అయితే దీనికి స‌మాదానం.. గతంలో అక్కడ జరిగిన ఓ హత్య వ‌ల్ల‌ గ్రామం మొత్తం ఖాళీ అయింద‌ట‌.


ఆ గ్రామంలో ఒకప్పుడు అన్ని గ్రామాల్లో మాదిరిగా జనాలు కళకళలాడుతూ ఉండేవారు.కాని భూమి పంచాయితీ కారణంగా దేవసహాయం  అనే ఒక రిటైర్డ్‌ టీచర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అప్పటి నుండి కూడా పోలీసులు హత్య కేసు ఎంక్వౌరీకి గ్రామస్తులను ప్రశ్నిస్తూ వచ్చారు. 1991 నుండి పోలీసులు గ్రామస్తులను రోజు ఏదో ఒక విధంగా ప్రశ్నిస్తూనే ఉండేవారు. పోలీసులు పదే పదే గ్రామానికి వస్తున్న నేపథ్యంలో  వివ‌రాలు చెప్పలేక ఒక్కొక్కరూ గ్రామాన్ని వదిలి వెళ్లడం ప్రారంభించారు. ఈ క్ర‌మంలోనే ఒక్క శేషం దానం కుటుంబం మినహా దప్పెర్ల ఖాళీ అయింది.


శేషం దానం కుటుంబం మాత్రం పుట్టి పెరిగిన ఊరును వదిలేయడం ఇష్టం లేక ఆ గ్రామంలోనే ఒంటరిగా నివ‌సించేవారు. కాని పిల్లల చదువు నిమిత్తం వారు కూడా వెళ్లి పోవడంతో వృద్ద దంపతులు మాత్రమే గ్రామంలో మిగిలి పోయారు. అయితే గ‌త ఏడాది వృద్దురాలు చనిపోయింది. దాంతో ఇప్పుడు ఆ గ్రామంలో ఒకే ఒక్క వృద్దుడు మిగిలి ఉన్నాడు. అతడు పక్క గ్రామం నుండి రేషన్‌ తీసుకు వచ్చి, ప్రభుత్వం ద్వారా వచ్చే పెన్షన్‌ను పొందుతూ జీవనంను సాగిస్తున్నారు. చాలామంది దప్పెర్లను ఖాళీ చేసి వచ్చేయమని అత‌డిని ఒత్తిడి చేసినా `ఇక్క‌డే పుట్టా.. జీవించి ఉన్నంత కాలం ఈ గ్రామంలోనే ఉంటా` అని అంటున్నాడ‌ట‌.


మరింత సమాచారం తెలుసుకోండి: