నిజానికి నేటి మనిషి ఒకప్పటితో పోలిస్తే అన్ని అంశాల్లోనూ ఎంతో వేగంగా ముందుకు వెళ్తుండడంతో పాటు రకరకాల నూతన ఆవిష్కరణలతో తన మేధో శక్తి యొక్క పవర్ ఊహకందని రీతిలో పెంచుకుంటూ పోతున్నాడు. అయితే అటువంటి నూతన విధానాల వలన లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉంటున్నాయి. ఆ విషయం అటుంచితే, కొన్ని కోట్ల మైళ్ళ దూరాన ఉన్న చంద్రుడిపైకి, అలానే ఇతర గ్రహాలపైకి ఎంతో సులువుగా చేరుకోగలుగుతున్న మనిషి, తన ప్రక్కనే ఉండి తనతో జీవితం గడిపే జీవిత భాగస్వామి మనసులో ఏముందో మాత్రం తెలుసుకోలేకపోతున్నాడని కొందరు మానసిక నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ముందుగా పెళ్లి అయిన తరువాత భార్య అయినా లేదా భర్త అయినా ఒకరిపై మరొకరు ఆధిపత్యం చూపించే విధంగా ఇటీవల ఎక్కువమంది వ్యవహరిస్తున్నారని, 

అయితే ఇటువంటివే నేటి కాపురాలను నిలువునా కూలుస్తున్నాయని కూడా వారు చెప్తున్నారు. ఇక పెళ్లి తరువాత కేవలం కొద్దిపాటి చిన్న, చిన్న నియమాలు, పద్దతులతో ప్రతి ఒక్క జంట కూడా వారి జీవితాలని బంగారు మయం చేసుకోవచ్చని కూడా వారు అంటున్నారు. అయితే అందుకోసం భార్యాభర్తలు ఎవరికి వారు భారీ త్యాగాలేమి చేయనవసరం లేదట. నిజానికి వారు పాటించమని చెప్తున్నవి ప్రత్యేకంగా సరికొత్త విషయాలేమి కాదు, ఎన్నో ఏళ్ళ నుండి మన పూర్వికులు చెప్తున్న పద్దతులనే చాలావరకు వారు కూడా సూచిస్తున్నారు. ముందుగా భార్యా భర్తలిద్దరూ ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండేలా వ్యవహరించాలట. అసలైన బంధానికి సిసలైన పునాది నమ్మకమేననేది ప్రతి ఒక్క జంట గుర్తుంచుకోవాల్సిన ప్రధమ విషయమని అంటున్నారు. 

ఇక ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకోవడం, అలానే అవతలి వారి ఇష్టాలను, అభిరుచులను గౌరవించి, అప్పుడప్పుడు వాటిని మనం కూడా ఆచరిస్తూ ఉండడం వంటివి చేయాలట. అలానే అవతలివారికి ఇబ్బందిని కలిగించే పనులు సాధ్యమైనంతవరకు చేయకుండా ఉంటె బెటరట. ముఖ్యంగా మనసులోని భావాలని దాచుకోకుండా, ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను ఎప్పటికపుడు వ్యక్త పరుస్తూ ఉండడంతో పాటు, దాంపత్య జీవనంలో అతి ముఖ్యమైన సంసారం సుఖంలో ఇబ్బందులు ఉంటె తప్పకుండా బయట పెట్టాలని, తద్వారా అవతలి వారు తమ లోపాలు తెలుసుకుని వాటిని సరిచేసుకోగలరని అంటున్నారు. అలా కాకుండా అటువంటివి మనసులోనే దాచుకుంటే, అవి మరిన్ని సమస్యలకు కారణభూతంగా మారుతాయనేది మరిచిపోకూడదట. అలానే పనులను పంచుకోవడంలో భార్యాభర్తలిద్దరూ కూడా సరిసమానంగా వ్యవహరించాలట. ఇక ఒక జంటలో ఎవరికైనా స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్లు ఉంటె, 

వాటిని తమ లైఫ్ పార్టనర్ యొక్క అనుమతితో అకేషనల్ గా తీసుకోవడం వంటివి చేయాలట. అలానే మరీ ముఖ్యంగా ఒకరిపై మరొకరికి అనుమానం అనే పెనుభూతాన్ని తమ మనసులోకి ఎప్పటికీ రానీయకుండా జీవించాలని అంటున్నారు. ఎందుకంటే అనుమానం అనేది ఒకసారి మన మనసులో ప్రవేశిస్తే, అది మన జీవితాన్ని సర్వనాశనం చేసేవరకు అంతం కాదనే విషయాన్ని ఎప్పటికీ మరిచిపోకూడదని అంటున్నారు. మనిషి పుట్టుకకు స్త్రీ ఎంత కారణమో పురుషుడు కూడా అంతే కారణం కాబట్టి, ఆ విషయాన్ని ఎరిగి ఒకరిపై మరొకరు ఆధిపత్యాన్ని కలిగి ఉండాలి అనే అంశం మాత్రం ఎప్పటికీ మదిలోకి రానీయకూడదని చెప్తున్నారు. ఆ విధంగా ప్రతి జంటా కూడా జీవితాంతం ఒకరికోసం మరొకరు అనేలా జీవించడం కనుక అలవర్చుకుంటే, తప్పకండా రాబోయే కాలంలో విడాకుల వంటివి తగ్గడంతో పాటు మనిషి జీవితం మరింత సుఖమయం అవుతుందని అంటున్నారు......!!


మరింత సమాచారం తెలుసుకోండి: