కాదేదీ కల్తీకి అనర్హం అంటూ కల్తీ రాయుళ్లు మనం తినే ఆహార పదార్ధాలను యధేచ్చగా కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యం తో చెలగాటం ఆడుతున్నారు. ఇందుగలదు అందులేదని సందేహంబు వలదు.. ఏందెందు వెతికినా అందందు కల్తీ కలదు అన్న చందాన దేశంలో కల్తీ వ్యాపారం మూడు పువ్వులు... ఆరు కాయలుగా విలసిల్లుతోంది. 
కందిపప్పులో కేసరి పప్పు, పాలు చిక్కగా కన్పించడం కోసం బియ్యం పిండి కలపడం, ధనియాల పొడి, కారం పొడి, వక్కపొడి, నెయ్యి, పంచదార, పసుపు, కాఫీ పొడి ఇలా నేడు మనిషి తీసుకునే ప్రతి ఆహార పదార్థంలోనూ కల్తీ రాజ్యమేలుతోంది.

ఏడాది క్రితం.. వంటనూనె కొనేందుకు ఓ దినసరి తెలంగాణ రాష్ట్రంలో ఓ జిల్లా కేంద్రం లోని ఓ సూపర్‌ మార్కెట్‌కు వెళ్లి, వంటనూనె కావాలని అడిగితే సదరు వ్యాపారి కల్తీ నూనె అంటగట్టాడు. దాంతో వంట చేసుకుని భోజనం చేసిన ఆ కుటుంబం మొత్తం వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయింది. కల్తీ నూనె వ్యవ హారం బయటకు రావడంతో అధికారులు అప్ప ట్లో హడావుడి చేశారు. కల్తీ వంటనూనె విక్రయిం చిన దుకాణంతో పాటు మరికొన్ని దుకాణాల్లో తనిఖీలు చేసి, చేతులు దులుపుకున్నారు.



కొందరు వ్యాపారులు ఆహార కల్తీనీ తమ ధనార్జనే ధ్యేయంగా యధేచ్చగా కల్తీని చేస్తున్నారు. వీటివల్ల ఎగుమతులు సన్నగిల్లే ప్రమాదం ఉంది. కల్తీ, నకిలీల మాఫియా ఒక్క భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. దేశవ్యాప్తంగా 2018-19 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం సేకరించిన ఆహార పదార్థాల నమూనాల్లో 26,077 కల్తీలు, అనుకరణలు ఉన్నట్లు తేలింది. ఇందులో ఉత్తర్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, తమిళనాడు రాష్ట్రాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆహార శాఖ సహాయ మంత్రి ఇటీవల రాజ్యసభకు తెలిపారు.


ఈ పరిస్థితిని నియంత్రించకపోతే దేశంలో 2025 నాటికి ప్రజలు పెద్దయెత్తున క్యాన్సర్‌ సహా పలు వ్యాధుల బారిన పడతారన్న ప్రపంచబ్యాంకు హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. చట్టాలు కఠినంగా లేకపోవడంతో అధికారులు కల్తీ రాయుళ్ళపై కేసులు నమోదు చేసిన శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం ఆహార కల్తీకి పాల్పడితే కఠిన శిక్షలు అమలు చేయాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: