స్వాతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజునే బాలల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈరోజు చిల్డ్రన్స్ డే అవ్వడంతో నెహ్రు కి గూగుల్ ఒక స్పెషల్ డూడుల్ ఫొటోతో నివాళులు అర్పించింది. ఆ డూడుల్ లోని చిత్రాన్ని గీసింది మరెవరో కాదు మన దేశంలోని గురుగ్రామ్‌కు చెందిన ఏడేళ్ల చిన్నారి దివ్యాన్షి సింఘాల్‌. ఈ చిన్నారి వయసు ఏడు సంవత్సరాలే కానీ ఆ పిల్ల గీసిన చిత్రంలో మాత్రం ఎంతో అర్ధం ఉంది. అందుకే ఈ సంవత్సరం గూగుల్ భారతీయ చిన్నారుల కోసం 'వెన్ ఐ గ్రో అప్...ఐ హోప్' అనే థీమ్ తో నిర్వహించిన డూడుల్‌ చిత్ర లేఖనం పోటీలలో దివ్యాన్షి ఈ చిత్రాన్ని గీసి మొదటి బహుమతిని గెలుచుకుంది.


ఈ బాలిక చిత్రాన్ని చూసి గూగుల్ ఫిదా అయిపోయింది. 'ది వాకింగ్ ట్రీ' అని పేరు పెట్టిన ఈ చిత్రం గురించి ఆ చిన్నారి అడిగినపుడు.. "నేను మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు.. అక్కడ కొంతమంది చెట్లను నరకడం చూసాను. చాలా బాధేసింది. ఒకవేళ ఆ చెట్లకే కాళ్ళు ఉన్నట్లయితే.. వాటిని మనం నరికెప్పుడు అవి మనకు దూరంగా వెళ్లిపోయేవి. అడ్డు ఉన్నాయంటూ చాలా మంది చెట్లను నరికివేస్తున్నారు. వాటికి గనుక కాళ్ళు ఉంటె మనకు అడ్డు రాకుండా వెళ్లిపోగలవు.

దాంతో వాటిని నరికివేయాల్సిన అవసరం మనకి రాదు. అప్పుడు చెట్ల నరికివేత కూడా చాలా తక్కువ ఉంటుంది. అందుకే (వెన్ ఐ గ్రో అప్ ఐ హోప్) నేను పెద్దదాన్నయ్యే సరికి చెట్లకు కాళ్ళు రావాలని ఆశిస్తున్నాను." అని వివరించింది.  ఇది విన్న తర్వాత ఆ చిన్నారికి ఉన్న సృజనకు, ఆలోచనకు ఫిదా అయిపోయిన గూగుల్ రూ. 5 లక్షలు ప్రకటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: