ప్రపంచ దేశాలను ఆర్థిక మాద్యం పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. పాపం ఈ మాంద్యం దెబ్బకు అర్జెంటీనా అయితే విలవిలలాడిపోతోంది. ఇక్కడ ద్రవ్యోల్బణం అత్యంత దారుణ స్థాయికి చేరుకుంది. ఫలితంగా అర్జెంటీనా ప్రజలు నిత్యావసరాలు సహా ఏదీ కొనుక్కోలేని దుస్థితి. చివరికి గర్భనిరోధక సాధనాలైన కండోమ్‌లు ఇతరత్రా పిల్స్ కూడా కొనేందుకు ఇక్కడి ప్రజలు ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 


అమెరికన్ డాలర్‌తో పోల్చితే అర్జెంటీనా కరెన్సీ అయిన 'పెసో' విలువ బాగా పడిపోయింది. ఈ పరిస్థితిపై అర్జెంటీనాలోని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్జెంటీనాలో ఈ ఏడాది కండోమ్‌ల విక్రయాలు 8 శాతం, గర్భ నిరోధక మాత్రల విక్రయాలు 6 శాతం పడిపోయాయి. ఈ విషయాన్ని వాటి తయారీదారులతోపాటు మెడికల్ షాపుల యజమానులు కూడా ధ్రువీకరిస్తున్నారు. ఈ దుస్థితిపై అర్జెంటీనాలోని వైద్య నిపుణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కండోమ్‌లు ఉపయోగించకుండా లైంగిక చర్యల్లో పాల్గొంటే సుఖ వ్యాధులు ప్రబలే అవకాశముందని వారు హెచ్చరిస్తున్నారు. 


దీనిపై ఓ హెచ్ఐవీ వ్యతిరేక ఉద్యమ సంస్థలో ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా పనిచేస్తోన్న మార్ లూకాస్ మాట్లాడుతూ ప్రభుత్వమే స్పందించి ఆసుపత్రుల్లో కండోమ్‌లను ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు. అర్జెంటీనాలో ద్రవ్యోల్బణం కారణంగా కండోమ్‌ల తయారీలో ఉపయోగించే ముడిపదార్థాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మరోవైపు అక్కడి కరెన్సీ 'పెసో' విలువ దిగజారిపోయింది. దీంతో ఈ ఏడాది ప్రారంభం నుంచే కండోమ్‌ల ధర 36 శాతం పెరిగిందని వీటి తయారీ సంస్థలైన తులిపాన్, జెంటిల్‌మన్ అధ్యక్షుడు ఫెలిపె కొపెలోవిక్జ్ తెలిపారు.

ఇక అర్జెంటీనాలో ప్రముఖ నటుడైన గిల్లెర్మో అక్వినో ఓ వీడియోలో మాట్లాడుతూ.. ''మా కరెన్సీ విలువ పడిపోవడం నన్నుతీవ్రంగా బాధిస్తోంది. కనీసం నా భాగస్వామిని కూడా సుఖపెట్టలేకపోతున్నాను. నా దగ్గర ప్రస్తుతం ఒకే ఒక కండోమ్ మిగిలి ఉంది. ఇదంతా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి వల్లే..'' అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అర్జెంటీనా ఆర్థిక పరిస్థితి ఇంతగా దిగజారడం, చివరికి కండోమ్‌‌లు సైతం కొనుక్కోలేని దుస్థితిలో ప్రజానీకం ఉండడంపై ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్.. ఈ విషయాలను అర్జెంటీనా వైద్య ఆరోగ్య శాఖ దృష్టికి తీసుకెళ్లగా దీనిపై ఎలాంటి స్పందన రాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: