జనన మరణాలు అనేవి మన చేతుల్లో ఉండవు సరికదా, ఎవరు ఎప్పుడు, ఎక్కడ, ఎలా మరణిస్తారో మనలోని ఎవారూ కూడా చెప్పలేం. ఈ భూమిపై పుట్టిన ప్రతి వాడు కూడా ఎప్పుడో ఒకప్పుడు గిట్టక తప్పదు అనేది జగమెరిగిన సత్యం. అయితే వారిలో మనం ఇష్టపడే వారు మరణిస్తే మాత్రం మన మనసుకు చెప్పలేనంత బాధ కలుగుతుంది. ఇన్నాళ్లూ మనతో కలియతిరిగిన వ్యక్తి ఇకపై మనముందుకు రారు, వారితో మనము మాట్లాడలేము అనే నిజాన్ని జీర్ణించుకోవడం నిజానికి ఎవరికైనా కష్టమే అని చెప్పాలి. అయితే అటువంటి బాధ మనకు కలుగకుండా, తమదైన శైలిలో ఒక వినూత్న పద్దతిని సృష్టించారు ఇటలీకి చెందిన అన్నా టిటేల్లి, రౌల్ బ్రెట్జల్ అనే డిజైనర్లు. 'చనిపోయినా కూడా మీరు ప్రేమించే వ్యక్తులను చెట్ల రూపంలో చూసుకొండి' అంటూ వారు ఒక వినూత్న ప్రచారం చేపట్టారు. 

 

దీని ప్రకారం, ఇటలీ ప్రాంతంలో ఎవరైనా చనిపోతే వారిని మాములు శవపేటికలో పూడ్చి పెట్టకుండా ఆ మృతదేహాన్ని వారు గుడ్డు ఆకారంలో ఉండే 'క్యాప్సూలా ముండి' అనే ఒక ప్రత్యేకమైన శవపేటికలో భద్రపరిచి దానిని భూమిలో పాతి పెడతారు. అనంతరం తమకు నచ్చిన ఒక మొక్క తాలూకు విత్తనాలను దానిపై చల్లుతారు. అవి మెల్లగా క్యాప్సూల్ ని అంటిపెట్టుకుని పెరగటం, అనంతరం ఆ మొక్క వేర్లు కాప్సూలాలోకి చేరడం జరుగుతుంది. అనంతరం మెల్లగా, రోజురోజుకు పూడ్చిపెట్టబడిన మనిషిలోని పోషకాలను విత్తనాలు గ్రహిస్తూ, కొద్దికొద్దిగా మనిషిశరీరంలోని ప్రతి అణువు వాటిలోకి చేరి మొక్కగా, ఆపై చెట్టుగా రూపాంతరం చెందుతుంది. 

 

ఆ విధంగా మనం ప్రేమించే వ్యక్తులు చెట్టురూపంలో మనకు  కనపడుతుంటారు, అలానే దానిని స్పృశిస్తే మనం ప్రేమించే వ్యక్తులను స్పృశించిన అనుభూతి మనకు కలుగుతుందని, ఆ విధంగా చనిపోయాక కూడా మన శరీరం అణువుల రూపంలో మొక్కగా జీవిచి ఉండవచ్చని అంటున్నారు వారిద్దరూ. అంతేకాక మనిషి అస్థికలతో కూడా చెట్లను పెంచే విధానాన్ని రూపొందిస్తున్నామని ఆ డిజైనర్లు చెపుతున్నారు. ఇప్పటికే ఇటలీలోని కొన్ని ప్రాంతాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ విధానాన్ని మరింతగా అభివృద్ధి చేయాలనీ చూస్తున్నారట ఆ ఇద్దరు డిజైనర్లు. ఒకవేళ ఈ విధానం కనుక మనదేశంలో కూడా అమలైతే ఒకరకంగా శ్మశానాల్లో ఇకపై సమాధుల కోసం కాంక్రీటు వినియోగడం తగ్గి, మెల్లగా శ్మశానాలన్నీకూడా చెట్లతో పచ్చదనంతో నిలుస్తాయని, ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతునం ఈ వార్తపై పలువురు ప్రజలు అభిప్రాయపడుతున్నారు..........!!  

మరింత సమాచారం తెలుసుకోండి: