నిజంగా ఆరోగ్యకరమైన బంధాన్ని కోరుకుంటున్నట్లయితే కొన్ని సూచనలు పాటించటం మంచిది అంటున్నారు . ఆడ కావచ్చు, మగ కావచ్చు రిలేషన్‌లో ఉన్నపుడు కొన్ని కొన్ని సందర్భాల్లో అభద్రతా భావానికి గురవుతుండటం సహజం. కొన్ని అనుమానాలు, అహాలు, అభద్రతా భావాలు తమ భాగాస్వామితో బంధాన్ని ధృడపరుచుకోవటానికి అడ్డుపడుతుంటాయి. అయితే ఇవన్నీ మన తప్పులు కాకపోవచ్చు. కానీ వీటన్నింటిని పక్కకు నెట్టి ముందుకు సాగిపోవాల్సి వస్తుంది. అయితే చాలా మంది మగవారు అభద్రతా భావంతో ఇబ్బందులు పడుతూ ఎదుటి వ్యక్తిని ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అలాంటి వారు తమను తరచుగా ఇబ్బంది పెట్టే విషయాల గురించి సరైన అవగాహన కలిగి ఉంటే వాటిని అధిగమించటం సులభం అవుతుంది. 


1) మగ స్నేహితులు
ఆడవారు మగవారితో స్నేహం చేయటంలో ఎటువంటి తప్పూలేదు. అయితే ఆ స్నేహం  బంధంలో ఉన్నపుడు కూడా కొనసాగితే కొద్దిగా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. తరచుగా మగ స్నేహితులతో మాట్లాడే వారి భాగస్వామి కొద్దిగా అభద్రతా భావానికి గురవుతారు. ఇలాంటి సమయంలో ఆడవారు తప్పని సరిగా నిజాయితీతో వ్యవహరించాలి. అబద్ధాలకు, దాపరికాలకు తావివ్వకూడదు. ఎదుటివ్యక్తి మానసిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నడుచుకోవటం మంచిది.  

2) గతం తాలూకూ గాయం
ఆడ,మగ తేడా లేకుండా అందరూ ఓ బ్రేకప్‌ తర్వాత మరో వ్యక్తిని నమ్మటానికి కొద్దిగా ఆలోచిస్తారు. గతం తాలూకూ గాయం వారిని వేధిస్తూనే ఉంటుంది. అందరినీ ఒకే దృష్టితో చూడటం మొదలుపెడతారు. ఇలాంటి వారు గతం తాలూకూ విషయాలను దూరంగా ఉంచటం మంచిది. పదే పదే గతాన్ని తలుచుకుంటూ బాధపడటం మానేయాలి. గతాన్ని తలుచుకుంటూ ప్రస్తుతాన్ని దుఃఖమయం చేసుకోకూడదు.

3)  రహస్యాలు
అంతర్ముఖులు ఎక్కువగా ఇతరులతో కలవటానికి ఇష్టపడరు. బంధంలో ఉన్నపుడు కూడా ఎదుటి వ్యక్తితో పూర్తిగా కలిసిపోవటానికి ఆలోచిస్తుంటారు. అది ఆడవాళ్లయితే ఎదుటి వ్యక్తిపై పూర్తి నమ్మకం కలిగినపుడు మాత్రమే వారితో అన్ని విషయాలు పంచుకుంటారు. అంతర్ముఖులైన ఆడవారితో బంధంలో ఉన్న మగవారు వారి ప్రవర్తనతో కొద్దిగా ఇబ్బందులకు గురవుతారు. ఏవో రహస్యాలను తమతో చెప్పకుండా దాస్తున్నారని భావిస్తారు.

4) భాగస్వామి విజయాలు
భాగస్వామి మనకంటే ఎక్కువ విజయాలను సొంతం చేసుకుంటున్న సమయంలో కొద్దిగా ఈర్శ్య పడటం మామూలే. ఆడవారు ఎక్కువగా తమకంటే ఆర్థికంగా మెరుగైన, సక్సెస్‌ ఫుల్‌ మగాడిని పెళ్లాడాలని భావిస్తారు. కానీ, మగవారు అలాకాదు. ఆడవారు తమకంటే ఎక్కువ విజయాలను సొంతం చేసుకుంటున్న కొద్ది మగవారిలో అభద్రతా భావం మొదలవుతుంది. తమను ఆటలో అరటిపండులా తీసిపడేస్తారేమో అన్న భయంతో కొట్టుమిట్టాడుతుంటారు. అలాంటి వారు లేని పోని భయాలను మాని ముందుకు సాగే ఆలోచనలు చేయాలి. బంధంలోకి ప్రేమను తప్ప! డబ్బును, హోదాలను తేకూడదు. వీలైతే భాగస్వామితో మాట్లాడి సమస్యను పరిష్కరించటానికి ప్రయత్నించండి. 

5) పక్క వారిపై ప్రశంసలు
పార్ట్‌నర్‌ తరచుగా ఇతరులపై(మగవారిపై) ప్రశంసలు కురిపించటం వల్ల మగవారు అభద్రతా భావానికి గురవుతారు. ఆ విషయాలు మెదడులోనుంచి అంత తొందరగా బయటకు వెళ్లిపోవు. ఇలాంటి సమయాల్లో ఆత్మన్యూనతా భావానికి లోనవుతారు. అయితే ఇలాంటి సమయాల్లో భాగస్వామిపై కోపం తెచ్చుకోకూడదు. ఇతరుల విజయాలను ప్రశంసించే ఆమె గుణాన్ని మనస్ఫూర్తిగా అభినందించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: