అతనొక బ్యాంకు ఉద్యోగి, మంచి జీతం, పెద్ద ఇల్లు ఉండడంతో ఈ ఉత్తమ పురుషుడికి ఒక పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి పెద్దల సమక్షంలో ఇరువురు పెళ్ళికి అంగీకరించి నిశితార్థం చేసుకున్నారు. సీన్ కట్ చేస్తే ఈ పెళ్లికొడుకు మరో యువతితో పెళ్లి పీటలపై కూర్చున్నాడు అదే సమయంలో నిశ్చితార్థం చేసుకున్న యువతి బంధువులు వచ్చి పెళ్లి కొడుకుని ఇదేంటని ప్రశ్నించారు. పెళ్లికొడుక్కి బడిత పూజ చేశారు. దీనితో గుర్రం ఎక్కాల్సిన మనోడు కాస్తా పోలీస్ జీప్ ఎక్కాడు. 

 

చిత్తూరు జిల్లాకు చెందిన మోహన్‌ కృష్ణ తిరుపతిలోని ఓ బ్యాంక్‌లో ఉద్యోగి. కొద్ది రోజుల క్రితం మోహన్ కృష్ణ తెలంగాణ రాష్ట్రము, మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మక్తల్‌ యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ తరువాత వధువు తరపు వారు తనకు కట్నకానుకలు తక్కువగా ఇచ్చారని సాకు చూపుతూ పెళ్లి ని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపాడు. కానీ నిశ్చితార్ధ సమయంలో కట్నం కింద తీసుకున్న డబ్బు, బంగారం మాత్రం తిరిగివ్వలేదు.

 

ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల తరువాత కర్నూల్ జిల్లా నంద్యాల కు చెందిన యువతితో పెళ్లి కుదుర్చుకున్నాడు మోహన్ కృష్ణ. ఈ విషయం తెలుసుకున్న మక్తల్ యువతి బందువులు, నిన్న పెళ్లి పీటలపై మోహన్ కృష్ణ కూర్చుని ఉండగా తమ దగ్గర తీసుకున్న డబ్బు, బంగారం ఇచ్చేయకుండా ఈ పెళ్లి ఎలా చేసుకుంటావంటూ ప్రశ్నించారు. ఆ విషయం తరువాత మాట్లాడుకుందాం అంటూ మోహన్ కృష్ణ తాళి కట్టడానికి సిద్దపడుతుండగా ఆ యువతి బంధువులు మనోడికి బడిత పూజ చేశారు. 

 

పెళ్లి కొడుకు మోసం తెలియడంతో అక్కడిక్కడే నంద్యాల వాసులు పెళ్లి రద్దు చేసుకున్నారు. పెళ్లికొడుకుపై యువతి బంధువులు పోలీసులకు పిర్యాదు చేయడంతో పోలీసులు మనోడిని స్టేషన్ కు తరలించారు. ఇక ఈ యువతి బంధువుల దగ్గర కూడా మోహన్ కృష్ణ భారీగా కట్నకానుకలు పొందినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: