భారత్ సుందరి సుమన్ రావు మిస్ వరల్డ్ కిరీటాన్ని తృటిలో చేజార్చుకుంది. చివరివరకు విజేత టోనీ యాన్ సింగ్ కు గట్టిపోటీ ఇచ్చిన సుమన్ రావు.. సెకండ్ రన్నరప్ గా నిలిచింది. దీంతో ఇంటర్నెట్ లో సుమన్ రావు టాప్ ట్రెండింగ్ లో ఉంది.

 

మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియా సుందరి సుమన్ రావు మూడో స్థానంలో నిలవడంతో.. ఆమె గురించి గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. సుమన్ రావుది రాజస్థాన్ రాష్ట్రం. ఆమె  1998 నవంబర్‌ 23 లో ఉదయ్‌పూర్‌ సమీపంలోని అయిదానాలో పుట్టింది. తండ్రి రతన్ సింగ్ నగల వ్యాపారి.  తల్లి సుశీలా కున్వర్ గృహిణి. సుమన్ రావు నవీ ముంబైలోని మహాత్మా స్కూల్‌ ఆఫ్‌ అకాడెమిక్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌లో పాఠశాల విద్య కంప్లీట్ చేసింది. ప్రస్తుతం ముంబై యూనివర్సిటీలో చార్టెర్డ్‌ అకౌంటెన్సీ చదువుతోంది.

 

2018లో మిస్‌ నవీముంబై పోటీలో సుమన్ రావు  మొదటి రన్నరప్‌గా నిలిచారు. తర్వాత రాజస్తాన్‌ తరఫున పాల్గొని ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ టైటిల్ గెలుచుకున్నారు. ఆ పోటీల్లోనే మిస్‌ ర్యాంప్‌ వాక్‌ అవార్డు కూడా సాధించారు. ఈ ఏడాది జూన్‌లో రాజస్థాన్ కు చెందిన సుమన్ రావు మిస్ ఇండియా 2019 టైటిల్ గెలుచుకుంది. సమాజంలో లింగ వివక్షతను అంతం చేయాలంటే అందరూ గళమెత్తాలనేది సుమన్ రావు నిశ్చితాభిప్రాయం.  లింగ సమానత్వం సమాజంలో అత్యంత అవసరమని ఆమె చెప్పింది. తనకు తన కుటుంబం పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని, కానీ చాలా మంది అమ్మాయిలకు ఆ అదృష్టం ఉండదని ఆవేదన వ్యక్తం చేసింది సుమన్ రావు. సినిమాల్లో నటించాలని కూడా సుమన్ రావు కలలు కంటోంది. సినిమాల్లో నటించాలనే ఆమె కోరిక తీరాలని మనమూ కోరుకుందాం.. ! మిస్ వరల్డ్ కిరీటం మిస్ అయినంత మాత్రాన సుమన్ రావు ఎలాంటి నిరుత్సాహానికి లోనుకాలేదు. మహిళా సమస్యలపై గళం విప్పాలని నిర్ణయించుకుంది. ఆ దిశగా తన అడుగులు వేస్తానంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: