కొత్త సంవత్సరం వస్తోందంటే చాలు.. వివిధ ఆకృతుల్లో, విభిన్న రుచులను అందించే కేకులను కొనేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. నూతన వత్సరంలో ప్రతిరోజూ మధురంగా గడిచిపోవాలని ఆకాంక్షిస్తూ తియ్యటి కేకులతో సంబరాలు చేసుకుంటారు. నోరూరించే కేకులను తినాలని పిల్లలే కాదు, పెద్దలు సైతం ఆరాటపడుతుంటారు. దుకాణాల్లో భారీ ధరలకు కేకులను కొనే బదులు మనకు నచ్చిన రుచులను ఆస్వాదించేలా ఇంట్లోనే సొంతంగా కేకులను తయారు చేసుకోవచ్చు. ఇంట్లో తయారు చేసిన కేకులతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికితే వేడుకలు మరింత వైవిధ్య భరితంగా ఉంటాయి. హార్లిక్స్ కేక్, చాకొలెట్ ఐస్‌క్రీమ్ కేక్, క్యారెట్ కేక్, ఖర్జూరం కేక్, కొబ్బరి కప్ కేక్, ఫ్రిజ్ కేక్, పైనాపిల్ కేక్, లెమన్ కేక్ వంటివి మనం సులభంగా చేసుకోవచ్చు. ‘ఎగ్’ ఇష్టపడని వారు దాన్ని వినియోగించకుండానే రుచికరమైన కేకులు చేసుకోవచ్చు. యాపిల్, పైనాపిల్, స్ట్రాబెర్రీ, వెనిల్లా, కాఫీ, కోక్, హార్లిక్స్, చాక్‌లెట్, చీజ్, ఐస్‌క్రీమ్‌లను బయట కొనుక్కొని విభిన్న రుచుల కేకులను తయారు చేసుకుంటే ఆ ఆనందమే వేరు. కేకులు తయారు చేసేందుకు అవసరమయ్యే చిన్న చిన్న పరికరాలు మార్కెట్‌లో లభిస్తాయి. ఎలెక్ట్రిక్ ఓవెన్ లేనివాళ్ళు సాధారణ ఓవెన్‌ను వాడవచ్చు. విజిల్, గ్యాస్‌కట్ అవసరం లేకుండా కుక్కర్‌లో నీళ్ళు పొయ్యకుండా గినె్నలో పదార్థాలు వేసి వీటిని చేసుకోవచ్చు.

 

హార్లిక్స్ కేక్
కావ‌ల‌సిన ప‌దార్ధ‌ములుః

మైదా - 2 కప్పులు
పంచదార - 1 1/2 కప్పు
జీడిపప్పు - 24
బాదం పప్పు - 24
కిస్‌మిస్ - 24
వెన్న - 3 కప్పులు
బేకింగ్ పౌడర్ - 2 చెంచాలు
హార్లిక్స్ పౌడర్ - 1 కప్పు
వెనిల్లా ఎసెన్స్ - 6 చుక్కలు
పాలు - 1 కప్పు
ఎండుకొబ్బరి - 2 చెంచాలు
గుడ్లు - 2
యాలకులు - 12
చెర్రీలు - 24
ఫ్రూటీ క్రూటీ - 24

త‌యారు చేసే విధానంః బేకింగ్ పౌడర్, మై దాపిండి, పంచదారను గిలక్కొట్టిన ఎగ్ మిశ్రమంలో కలుపుకోవాలి. వెన్నలో సగం వేసి బాగా కలపాలి. చిన్న పాత్రలో వెన్న రాసి, అందులో పై మిశ్రమాన్ని పోసి జీడిపప్పు,యాలకుల పొడి, కొబ్బరి కోరు, కిస్‌మిస్ కలిపి కుక్కర్‌లో పెట్టుకోవాలి. ఇది బాగా ఉడికి కమ్మటి వాసన వస్తుండగా దింపి ట్రేలో పెట్టాలి. మిగిలిన వెన్నలో అరకప్పు పంచదార వేసి బాగా కలిపి దాన్ని పైన చేసుకున్న కేక్ పైభాగంపై సర్దాలి. దీనిపై చెర్రీలు, ఫ్రూటీ క్రూటీ ముక్కలను అలంకరించాలి.
.................................................................................................

 

పన్నీర్ డ్రైఫ్రూట్ పాయసం

కావలసిన పదార్థాలు:
పాలు.. లీటరు
పనీర్.. ఒక కప్పు
కొబ్బరితురుము.. అర కప్పు
పంచదార.. ఒక కప్పు
యాలకుల పొడి.. అర స్పూన్
శాఫ్రాన్.. కొద్దిగా
నెయ్యి.. తగినంత
ఎండు ద్రాక్షలు.. కొద్దిగా

జీడిపప్పు, బాదం, పిస్తా.. సరిపడా.

తయారు చేసే విధానం: ముందుగ స్టౌవ్ వెలిగించి పాత్రలో పాలను పోసి మరిగించాలి. ఇందులో పనీర్ తురుము, కొబ్బరితురుము వేసి ఉడికించాలి. పంచదార కూడా వేసి కలిపి స్టౌవ్ సిమ్‌లో ఉంచి మిశ్రమం చిక్కగా అయ్యేవరకు ఉడికించి యాలకులపొడి వేయాలి. ఇంకో పాత్రలో ఒక స్పూన్ నెయ్యి వేడిచేసి ఎండు ద్రాక్షలు, జీడిపప్పు, బాదం, పిస్తా వేయించాలి. వీటిని మరిగించిన పాలలో కలపాలి. ఖీర్ బాగా చిక్కగా కావాలంటే కొంచెం కోవా వేసుకోవచ్చు. అంతే పసందైన పన్నీర్ డ్రైఫ్రూట్ పాయసం రెడీ. వేడిగా తాగాలనుకుంటే అలాగే తాగొచ్చు లేదంటే ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా తాగితే ఇంకా బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: