నయాసాల్‌ జోష్‌కు ఆంక్షల అడ్డంకి ఎదురైంది. మందేస్తూ... చిందేస్తూ.. ఉర్రూతలూగేందుకు పార్టీ లవర్స్‌ గెట్‌ రెడీ అంటుంటే... తస్మాత్‌ జాగ్రత్త అంటున్నారు పోలీసులు. ట్రెండీ ఈవెంట్లతో అధరగొట్టే ఈవెంట్‌ ఆర్గనైజర్లూ వెనకడుగువేస్తున్నారు. థర్టీఫస్ట్‌కు మూడురోజులే ఉన్నా.. సిటీలో కొత్త సంవత్సరం సందడే లేదు. అడుగడుగునా పోలీసుల ఆంక్షలు.. పార్టీ లవర్స్‌ ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. 

 

న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకోవడంలో హైదరాబాదీలు వెరీ స్పెషల్‌. 2019కి గుడ్‌బై చెబుతూ... 2020కి వెల్‌కం చెప్పేందుకు పార్టీ లవర్స్‌ ఉర్రూతలూగుతున్నారు. కానీ.. వీరి ఆశలు నీరుగారుతున్నాయి. నగరంలో న్యూ ఇయర్ సందడే లేదు. బాలీవుడ్‌, టాలీవుడ్‌ సెలబ్రిటీలు, హోరెత్తించే డీజేలు, విందు వినోదాలతో మిడ్‌నైట్‌ పార్టీకి ముస్తాబయ్యే నగరం మూగబోయింది. సిటీలో న్యూ ఇయర్‌ వేడుకల హడావిడే లేదు. 

 

క్లబ్‌లు, పబ్‌ల్లో డీజేల హోరు... టాలీవుడ్‌, బాలీవుడ్‌ స్టార్స్‌ సందడి.. మ్యూజికల్‌ నైట్స్‌.. బాలీబాస్ట్‌, బిగ్గెస్ట్‌ బాష్‌ వంటి మిడ్‌నైట్‌ పార్టీలతో సందడిగా మారే నగరం మూగబోయింది. డిసెంబర్‌ 31  నైట్‌కు పదిరోజుల ముందు నుంచే రకరకాల కార్యక్రమాలతో కళకళలాడే సిటీలో జోష్ లేకుండా పోయింది. పోలీసులు పెట్టిన ఆంక్షలతో అటు పార్టీ లవర్స్‌, ఈవెంట్‌ ఆర్గనైజర్లే కాదు.. సెలబ్రేట్‌ చేసుకుందామనుకుంటున్న సామాన్యుడికి సైతం దడపుడుతోంది. 

 

న్యూ ఇయర్‌ ఈవెంట్‌ చేయాలన్నా ఆంక్షలు... ఈవెంట్‌కి వెళ్లాలన్నా ఆంక్షలు... వెళ్లివచ్చేటప్పుడూ... ఆంక్షలు అడ్డంకులు..! ఇలా అయితే న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ చేసుకునేదెలా..? ఇది ఈవెంట్‌ ఆర్గనైజర్లు, పార్టీ లవర్స్‌ మాటే కాదు... మినిమమ్‌ సెలబ్రేషన్స్‌ చేసుకుందామనుకున్న సామాన్యుడి ఆవేదన. ఈవెంట్‌ ఆర్గనైజ్‌ చేయాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరి. అనుమతి తీసుకుందామంటే సవాలక్ష నిబంధనలు, అడ్డంకులు, ఆంక్షలు. అయినా సరే ఈవెంట్‌ చేసినా... పెట్టిన పెట్టుబడి వస్తుందన్న నమ్మకం లేదు. ఈవెంట్స్‌కి వెళ్దామనుకున్న వాళ్లకు సైతం పోలీసులు పెట్టిన ఆంక్షలు సెలబ్రేషన్స్‌కి అడ్డంకిగా మారుతున్నాయి. సిటీలో థర్టీఫస్ట్‌కి పదిరోజుల ముందే మొదలయ్యే హడావుడి, సందడి.. ఈ ఏడాది లేకుండా పోయాయి. 

 

పెరిగిన మద్యం రేట్లు... ఈవెంట్‌ ఆర్గనైజింగ్‌ ట్యాక్స్‌... రాత్రి పది నుంచి తెల్లవారుజామున రెండు గంటల వరకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌... దొరికితే పదిదేల రూపాయల ఫైన్‌, జైలు శిక్ష, 12 గంటల వరకే సెలబ్రేషన్స్‌కు అనుమతి... 45 డెసిబుల్స్‌కి మించి సౌండ్‌ మించరాదు... ఇలా సవాలక్షా నిబంధనలు ఉక్కిరబిక్కిరి చేస్తున్నాయి. ఏడాదికోసారి జరుపుకునే న్యూ ఇయర్‌ వేడుకలకు ఆంక్షలు అడ్డంకిగా మారుతున్నాయి. 

 

మరో రెండు రోజుల్లో న్యూ ఇయర్ రాబోతుంది. సిటీ కల్చర్ కు అలవాటు పడ్డ యువతను మత్తులో ముంచేందుకు డ్రగ్స్ మాఫియా ఇప్పటికే రంగంలోకి దిగింది. పెద్ద ఎత్తున డ్రగ్స్‌, గంజాయి వంటి మత్తుపదార్థాలు పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాయి. మైనర్లు, మేజర్లు, అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా ఒళ్లు మరచి ఎంజాయ్ చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. న్యూ ఇయర్‌ వేడుకల్లో పెద్దమొత్తంలో డ్రగ్స్ సరఫరా అయ్యే అవకాశాలున్నాయనే సమాచారంతో పోలీసులు, ఎక్సైజ్‌శాఖ గట్టి నిఘాపెట్టింది. 

 

చేతిలో పెగ్గు.. కౌగిట్లో లేడీ.. ఒళ్లు మైమరచిపోయే మత్తు.. ఇంకేముంది.. అరె మామా ఏక్‌ పెగ్‌ లావ్‌ అంటూ రెచ్చిపోయేందుకు గెట్‌ రెడీ అంటున్నారు సీటీ కుర్రకారు. సెలబ్రేషన్స్‌ పేరుతో రేవ్‌, ముజ్రా పార్టీలకు కొందరు తెర లేపుతున్నారు. ముఖ్యంగా నగర శివారుల్లో ఉండే రిసార్టులు.. ఫాం హౌసులు వీటికి అడ్డాగా నిలుస్తున్నాయి. ప్రతి ఏడాది న్యూ ఇయర్‌ వస్తుందంటే ఈ దందాలు స్పీడ్‌ అందుకుంటాయి. దీంతో ఈఏడాది పోలీసుల కన్ను సిటీ శివారుల్లోని ఫాంహౌస్‌లు, రిసార్ట్‌లపై పడింది. ఇటీవల జరిగిన సంఘటనలు సైతం వార్నింగ్‌ బెల్స్‌ మోగిస్తున్నాయి. పంజాగుట్ట లోని లిస్బాన్ పబ్‌లో మందుతో పాటు అమ్మాయిలను కూడా సరఫరా చేసే గుట్టురట్టు చేశారు పోలీసులు. మరోవైపు ఓయో లాడ్జీలపై కూడా తనిఖీలు చేస్తూ నిఘా పెట్టారు పోలీసులు. 

 

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లోని ప్రధానమైన మూడు ఫ్లై ఓవర్లు రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 2 గంటలకు మూసివేయనున్నారు. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, బషీర్ బాగ్ ఫ్లై ఓవర్లతోపాటు.... పీవీ ఎక్స్ ప్రెస్ హైవే పరిధిలోని అన్ని జంక్షన్లు మూసివేస్తున్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. మీడియం, హెవీ ట్రాక్కులకు మాత్రమే అనుమతి ఉంటుంది. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణీకులు కూడా ఫ్లైట్‌ టికెట్‌ చూపిస్తేనే ఫ్లై ఓవర్‌పై అనుమతి ఉంటుంది. 

 

ప్రజా భధ్రతను దృష్టి లో ఉంచుకొని న్యూ ఇయర్ వేడకలను రాత్రి 8 గంటల నుంచి ఒంటి గంట వరకే అనుమతిచ్చారు పోలీసులు. ర్యాలీలు నిర్వహించడం.. ఓవర్ స్పీడ్ తో ప్రయాణించడం, బైక్ పై ట్రిపుల్ రైడింగ్, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ వంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు హెచ్చరించారు. న్యూ ఇయర్ సందర్భంగా హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లు, రిసార్టులు, పబ్‌లు, ఓపెన్‌ ఏరియాలు వంటి ఇతర కేంద్రాల్లో భారీఎత్తున ఈవెంట్లను నిర్వహించి టికెట్లు, ఎంట్రీ పాస్‌ల ద్వారా డబ్బులు వసూలు చేసే వారంతా 28 శాతం జీఎస్టీ చెల్లించాలని రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ స్పష్టంచేసింది. ఇది సైతం.. ఈవెంట్‌ ఆర్గనైజర్లకు భారంగా మారుతోంది. దీంతో ఏటా ఈవెంట్లు నిర్వహించే ఆర్గనైజర్లు సైతం ఈ ఏడాది వెనకడుగు వేస్తున్నారు. 

 

మందుబాబులకు  మెట్రో రైళ్లలో నో ఎంట్రీ  ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితిలోను మద్యం తాగి మెట్రో రైళ్లలో ప్రయాణించే అవకాశం లేకుండా పోయింది. ఇదే నిబంధన న్యూ ఇయర్‌కూ వర్తించనుంది. పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటే కేసులు తప్పవంటున్నారు పోలీసులు. 

 

కనీసం అపార్ట్‌మెంట్‌వాసులు, కాలనీవాసులతో కలిసి ఫ్యామిలీస్‌తో సరదాగా సెలబ్రేట్‌ చేసుకుందామనుకున్నా... ఇక్కడా పోలీసుల ఆంక్షలు తప్పనిసరి. డీజేలకు అనుమతిలేదు. సౌండ్‌ బాక్స్‌లు, స్పీకర్లు పెట్టినా.. సౌండ్‌ 45 డెసిబుల్స్‌కి మించరాదని హెచ్చరిస్తున్నారు. సెలబ్రేషన్లు సైతం ఒంటిగంటలోపు పూర్తిచేయాలంటున్నారు. ఇలా... అడుగడుగునా సవాలక్షా నిబంధనలు... న్యూ ఇయర్‌ వేడుకలకు అడ్డంకిగా మారుతున్నాయి. దీంతో... ఎంతో ప్లాన్‌ చేసుకున్న పార్టీ లవర్స్‌, సిటీ యువత ఉసూరుమంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: