కాలం కేలండ‌ర్‌లో మ‌రో సంవ‌త్స‌రం పాత‌బ‌డింది. న‌వ య‌వ్వ‌నంతో నూత‌న సంవ‌త్స‌రం ర‌య్య‌న దూసుకు వ‌చ్చేసింది. ఈ న‌వ న‌వోన్వేష నూత‌న సంవ‌త్స‌రానికి `ఇండియ‌న్ హెరాల్డ్` ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతోంది. 2020 సంవ‌త్స‌రం మ‌రిన్ని మేలు మ‌లుపులు సంతరించుకుని రాజ‌కీయంగా, ఆర్థికంగా, శాంతి సామ‌ర‌స్యాల ప‌రంగా రెండు తెలుగు రాష్ట్రాలూ పుంజుకోవాల‌ని ` ఇండియ‌న్ హెరాల్డ్ ` ఆశిస్తోంది. నూత‌న సంవ‌త్స‌రానికి శుభాహ్వానం ప‌లుకుతూనే.. పాత సంవ‌త్స‌రం మిగిల్చిన అనేక అనుభ‌వాల‌ను స‌మ్మ‌రించుకుంటూ.. కొత్త సంవ‌త్స‌రంలో స‌రికొత్త కోయిల‌ల కూహూ రావాల‌ని ఆస్వాదించే స‌మున్న‌త త‌రుణం ఇదే! మ‌నుషుల మ‌ధ్య మాన‌వ సంబంధాలు మృగ్య‌మైనా.. రాజ‌కీయ సంబంధాలు మాత్రం పెరుగుతుండ‌డం గ‌త ఏడాది పంచిన స‌రికొత్త అనుభూతి.

 

దేశంలోనే కాకుండా, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజ‌కీయాల్లో స‌రికొత్త సంగ‌త‌లు 2019లో చోటు చేసుకున్నాయి. రెండో సారి న‌రేంద్ర మోడీ మ‌రింత ఉర‌క‌లెత్తే ఉత్సాహంతో కేంద్రంలో అధికారంలోకి రావ‌డం, అదే స‌మ‌యంలో అతి ప్రాచీన పార్టీ కాంగ్రెస్ త‌న ఉత్థానాన్ని వ‌దులుకుని ప‌త‌నం దిశ‌గా అడుగులు వేసిన సంగ‌తుల‌కు 2019 స‌జీవ సాక్ష్యం. అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం, జ‌మ్ము క‌శ్మీర్‌లో ఏడు ద‌శాబ్దాలుగా అమ‌ల్లో ఉన్న 370 ఆర్టిక‌ల్‌ను ఒక్క క‌లం పోటుతో తుత్తునియ‌లు చేయ‌డం, రెండు రాష్ట్రాలుగా విడ‌గొట్ట‌డం స‌హా జాతీయ పౌర‌స‌త్వ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ తీసుకురావ‌డం వంటి అనేక కీల‌క అంశాలకు కూడా కొన్ని గంట‌ల ముందు చ‌రిత్ర‌లో క‌లిసిన 2019 నిక్షిప్తం చేసుకున్న చారిత్ర‌క అంశాలు.

 

ఇక‌, రాష్ట్రాల స్థాయిలో చూస్తే.. మోడీ, అమిత్‌షాల హ‌వా కేంద్రంలో క‌నిపించినా.. రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే.. మాత్రం ప‌ల‌చ‌నైంది. రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం కోల్పోయి, క‌ర్ణాట‌క‌లో వ్యూహాత్మ‌క రాజ‌కీయాల‌కు తెర‌దీసి అధికారంలోకి వ‌చ్చింది కూడా గ‌త ఏడాదే కావ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, జార్ఖండ్‌లో నూ ప్ర‌భుత్వాన్ని కోల్పోయి ప్ర‌తిప‌క్షానికి ప‌రిమితం కావ‌డం కూడా బీజేపీకి చేదుగుళిక‌గానే మారిపోయింది. జాతీయ స్థాయిలో ప‌రిస్థితి ఇలా ఉంటే.. రెండు తెలుగు రాష్ట్రాల ప‌రిస్థితులు కూడా 2019లో చిత్రాతి చిత్రంగా సాగాయ‌ని చెప్పుకోవాల్సిందే. త‌న‌కు తిరుగులేద‌ని అనుకున్న తెలంగాణ అధినేత కేసీఆర్‌కు పార్ల‌మెంటులో చేదు అనుభ‌వం ఎదురైంది. త‌న కుమార్తె క‌విత ఓట‌మి పాల‌వడం ఆయ‌న‌కు బెడిసి కొట్టిన వ్య‌వ‌హారంగానే చూడాలి.

 

అదే స‌మ‌యంలో కాంగ్రెస్, బీజేపీలు పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో పుంజుకున్న తీరు కూడా కేసీఆర్ కు ప్ర‌జ‌ల నుంచి ఎదురైన హెచ్చ‌రిక‌లు గానే మిగిలాయి. ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. 2019లో జ‌రిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ విజృంభించి.. అప్ర‌తిహ‌త విజ‌యాన్ని సొంతం చేసుకుని జ‌గ‌న్ కు అధికారం ద‌క్కేలా చేసింది. ఇక‌, త‌న‌కు తిరుగులేద‌ని, క‌నీసం మ‌రో ప‌దేళ్ల పాటు అధికారం త‌మ‌దేన‌ని భావించిన టీడీపీ ఘోర ప‌రాజ‌యం పాలై.. ప్ర‌తిప‌క్షానికి ప‌రిమిత‌మైంది. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యాలు కూడా దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. దిశ చ‌ట్టం, పాఠ‌శాల‌ల్లో తెలుగు మీడియం తీసేయ‌డం, మూడు రాజ‌ధానుల నిర్ణ‌యం, మ‌హిళ‌ల‌కు నామినేటెడ్ పోస్టుల్లో 50శాతం రిజ‌ర్వేష‌న్ వంటివి ఏపీలో గ‌త సంవ‌త్స‌ర‌పు మెరుపులుగా మిగిలాయ‌న‌డంలో సందేహం లేదు.

 

కొన్ని ద‌శాబ్దాలుగా మాట‌ల‌కే ప‌రిమిత‌మైన మ‌హిళ‌ల‌కు హ‌క్కులు, ప‌ద‌వుల విష‌యంలో జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం దేశంలోని అనేక రాష్ట్రాల‌ను మైమ‌ర‌పించింది. దిశ చ‌ట్టంపై అనేక రాష్ట్రాలు అధ్య‌య‌నానికి ముందుకు రావ‌డం గ‌మ‌నార్హం. అదే స‌మ‌యంలో ఏపీ ప్ర‌భుత్వంలో మ‌హిళ‌ల‌కు కూడా ప్రాధాన్యం పెంచ‌డం, వారికి కీల‌క‌మైన బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం వంటివి కూడా గ‌త కాల‌పు ఏపీ రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న స‌రికొత్త విష‌యాలుగానే సంత‌రించుకున్నాయి. సంక్షేమం, ప్ర‌భుత్వ ప‌థ‌కాలను చేరువ చేసేందుకు దేశంలోనే తొలిసారి తీసుకువ‌చ్చిన గ్రామ స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌.. అది కూడా మ‌హాత్మాగాంధీ జ‌యంతి నాడు ప్రారంభించ‌డం రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో చ‌ర్చ‌కు నిలిపింది. మొత్తంగా చూసుకుంటే.. ఏపీలో పాల‌నా ప‌రంగా 2019లో సంచ‌ల‌నాలు చోటు చేసుకున్నాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

 

ఇక‌, జ‌నాభా ప‌రంగా చూస్తే.. క్రైం రేటు భారీ ఎత్తున పెర‌గ‌డం, మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, కుంటుంబ క‌ల‌హాలు, హ‌త్య‌లు, మార‌ణ‌హోమాలు, న‌మ్మక ద్రోహాలు, నయ‌వంచ‌న‌లు.. వంటివి నిత్య‌కృత్యంగా మారి 2019లో అనేక సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ఏదేమైనా.. గ‌డియార‌పు చ‌ట్రంలో బందీ అయిన కాలం గిర్రున తిరుగుతూ.. మ‌రో సంవ‌త్స‌రంలోకి మ‌నల‌ను తీసుకువెళ్తున్న క్ష‌ణంలో.. ``గ‌త కాల‌ము కంటె మేల్‌.. వ‌చ్చు కాల‌మున్‌!``-అన్న విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ శాస్త్రి వారి వాక్కులు నిజ‌మ‌వ్వాల‌ని ` ఇండియ‌న్ హెరాల్డ్ `మ‌న‌సావాచా కోరుకుంటోం ది. ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌లు సుమ‌న‌స్కులై.. సామ‌ర‌స్య‌పూర్వ‌క  వాతావ‌ర‌ణంలో స‌రికొత్త సంవ‌త్స‌రాన్ని స్వాగ‌తించాల‌ని ` ఇండియ‌న్ హెరాల్డ్ ` అభిల‌షిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: