నూతన సంవత్సర వేడుకల్లో పూటుగా మద్యం సేవించి  వాహనాలు నడిపిన మందుబాబుల  భరతం పట్టారు తెలంగాణ  పోలీసులు . హైదరాబాద్ , సైబరాబాద్ , రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన  డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో  మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న  3, 148 మంది పై కేసులు నమోదు చేశారు . ఇందులో ఒక మహిళ కూడా ఉండడం విశేషం . అత్యధికంగా హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 951 మందిపై  కేసులు  నమోదు చేశారు పోలీసులు . ఇక తరువాతి స్థానం లో సైబరాబాద్ పోలీసులు ఉన్నారు .

 

సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 873 కేసులు నమోదయినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు . రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధి లో కేవలం 281  కేసులు నమోదయ్యాయి . ఇక నూతన సంవత్సర వేడుకల సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా  ఎటువంటి ప్రమాదాలు , అపశ్రుతులు చోటు చేసుకోలేదని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు . నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకుని పోలీసులకు సహకరించిన ప్రజలకు అయన ధన్యవాదాలు తెలిపారు . నూతన సంవత్సర వేడుకల్లో ఎటువంటి అపశ్రుతులు దొర్లకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు . రాత్రి పూట ప్లై ఓవర్లను మూసివేయడమే కాకుండా , విరివిగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు .

 

మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలు కొని తెచ్చుకోకుండా ముందస్తుగా , ప్రజల్లో అవగాహన కల్పించారు . రాష్ట్రం లో మద్యం ఏరులై పారినట్లు ఎక్సయిజ్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి . నూతన సంవత్సర వేడుకల సందర్బంగా  మద్యం దుకాణాలు కిక్కిరిసిపోగా , పబ్ లు , క్లబ్ ల్లోనూ యువత సందడి చేశారు . ఇక నగరం లో పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: