ఒక తుపాకీని బాగానే సంపాదించి తనతోపాటు తెచ్చుకున్నాడు కానీ దాన్ని సరైన సమయంలో తీయలేక పోయి తన ప్యాంటులో తానే కాల్చుకొని అంతర్జాతీయ వార్త అయ్యాడు ఒక దొంగ. ప్రస్తుతం ఈ దొంగ అమాయకత్వాన్ని చూసి నవ్వాలో ఏడవాలో తెలియక నెటిజన్లు సందిగ్ధంలో పడిపోయారు.


వివరాల్లోకి పోతే, డిసెంబర్ 27 వ తారీఖున పశ్చిమ మెక్సికోలోని జలిస్కో నగరంలో ఒక బస్సును ఇద్దరు వ్యక్తులు ఎక్కారు. ఆ తరువాత బస్సు వెనకకి వెళ్లారు. ఒక వ్యక్తి సీట్ లో కూర్చొనగా మరొక వ్యక్తి తన ప్యాంటు లోపల ఒక పెద్ద తుపాకీ ఉండటంతో అలానే నిల్చుండిపోయాడు. బస్సు నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లేంత వరకు వేచి చూసి ఆ తరువాత దొంగతనం చేయాలని ఆ ఇద్దరు వ్యక్తులు సైగలు చేసుకున్నారు. దొంగతనం చేయాలంటే బెదిరించాలి, బెదిరించాలంటే తన దగ్గర ఉన్న గన్ ని బయటకు తీయాలి.. అదే చేయబోయాడు ఈ దొంగ. కానీ ఆ పెద్ద గన్ తన ప్యాంటులో ఇరుక్కుపోయి బయటికి రాలేదు. పాపం దొంగతనం చేయడం కొత్తేమో కానీ..తెగ కంగారుపడుతూ ఆ గన్ ను అజాగ్రత్తగా బయటకి లాగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఆ గన్ ట్రిగ్గర్ కు అతని వేళ్లు తగిలి ఒక్కసారిగా అది పేలి బస్సు రూఫ్ కు, ఇంకా వెనుక అద్దానికి తాకి కింద పడిపోయింది.



దాంతో అతడు కింద కూర్చుండిపోయాడు. బస్సు లో ఉన్నవారంతా భయబ్రాంతులకు గురై ఈ ఇద్దరి వైపు వింతగా చూసారు. ఈ గన్ పేలిన శబ్దానికి డ్రైవర్ బస్సు ని ఆపుచేసాడు. ప్లాన్ ఫెయిల్ అయిపోయిందని బస్సు నుంచి దిగి వెళ్లిపోయారు వీళ్లిద్దరు. అయితే బస్సు దిగేప్పుడు అతడి స్నేహితుడు... బస్సు లో పడిపోయిన గన్ ను తీసుకొని వెళ్ళిపోయాడు. వీరి తతంగం అంతా బస్సు లో ఉన్న ఒక సీసీ టీవీ లో రికార్డు అయింది. ఆ వీడియో రికార్డు ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ ప్యాంటు లో కాల్చుకున్న వ్యక్తి చిన్నపాటి గాయాలతో లేదా ఏ గాయం లేకుండా తప్పించుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: