మారుతున్న పోటీ ప్రపంచంలో క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగాలకు ఎంపిక కావడం అనేది ప్రతి విద్యార్థి కల. ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఉద్యోగం సాధించాలని ఆశ పడుతూ ఉంటారు. మారుతున్న కాలంలో ఎంతో టాలెంట్ ఉంటే మాత్రమే క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఉద్యోగాలకు ఎంపిక అవుతున్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూలను నిర్వహించే ఏ కంపెనీ అయినా తమ కంపెనీని ఉన్నత స్థానంలో నిలిపే అభ్యర్థుల కోసం మాత్రమే అన్వేషిస్తుంది. 
 
క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఉద్యోగాలు తెచ్చుకోవటం చాలా కష్టమని యువతలో ఎక్కువ మంది అభిప్రాయపడుతుంటారు. కానీ కొన్ని టిప్స్ పాటిస్తే క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఉద్యోగాలు సాధించటం పెద్ద కష్టమేమీ కాదు. ఇంగ్లీష్ వలన క్యాంపస్ సెలక్షన్ లో ఎంపికవడం కష్టమని భావించేవాళ్లు ఇంగ్లీష్ కష్టమని భావించడం మానుకొని గ్రామర్ విషయంలో తప్పులు రాయకుండా జాగ్రత్త వహిస్తూ కృషి చేయాలి. క్యాంపస్ సెలక్షన్ లో ముఖ్యంగా ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, రీజనింగ్, అరిథమెటిక్ మొదలైన అంశాలపై రాతపరీక్ష నిర్వహిస్తారు. రెండో దశలో గ్రూప్ డిస్కషన్, మూడో దశలో టెక్నికల్ రౌండ్ చివరగా హెచ్.ఆర్ రౌండ్ ఉంటాయి. 
 
క్యాంపస్ ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు కంపెనీ గురించి అవగాహన పెంచుకోవటంతో పాటు తమ పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా వ్యక్తం చేయగలగాలి. పరిజ్ఞానంతో పాటు భాషా పటిమ, భావ వ్యక్తీకరణలో స్పష్టత మరియు సూక్ష్మత అవసరం. ఏదైనా విషయాన్ని వివరించే సమయంలో స్పష్టతతో పాటు ధారాళంగా వివరించే సమర్థత కూడా అవసరం. ఇంజనీరింగ్ అభ్యర్థులు సంబంధిత కంపెనీకి సంబంధించిన పాత మోడల్ పేపర్లను పరిశీలించటంతో పాటు సీ, జావా లాంగ్వేజ్ లపై దృష్టి పెట్టాలి. ఉద్యోగంలో ఎంపిక కాకపోతే ఎక్కడ తప్పు జరిగిందో పరిశీలించుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. బాడీ లాంగ్వేజ్ ను మెరుగుపరుచుకోవడంతో పాటు మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే శ్రమకు తగిన ఫలితం లభించి సులభంగా ఉద్యోగం సాధించవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: