ఆస్ట్రేలియాలో కార్చిచ్చు అంటుకున్న విషయం తెలిసిందే. ఆగ్నేయ ప్రాంతంలో అడవులు నిలువునా కాలిపోయి మసి అయిపోయాయి. అయితే నూతన సంవత్సరం వేడుకలు చేసుకునేందుకు తరలివచ్చిన పర్యాటకులు మంటల తాకిడికి సమీపంలోని బీచ్‌లకు పారిపోవాల్సి వచ్చింది. న్యూ సౌత్‌వేల్స్, విక్టోరియా రాష్ట్రాలకు మంటలు వ్యాపించడంతో సమీపంలోని బీచ్‌లకు దాదాపు 4 వేల మంది పారిపోయి వచ్చారు.

 

ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాలో కొన్ని నెలలుగా అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మంటలు చాలా తీవ్రంగా ఉన్నాయి. పొగ దట్టంగా వ్యాపిస్తోంది. దీంతో విమానాల ద్వారా నిఘా, వాటర్‌ బాంబ్‌లను ఉపయోగిస్తున్నట్లు న్యూసౌత్‌ వేల్స్‌ గ్రామీణ అగ్నిమాపక యంత్రాంగం తెలిపింది. అధికారులు మాట్లాడుతూ ప్రజలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చాలా రోజులుగా హెచ్చరిస్తూనే ఉన్నామన్నారు.

 

ఆస్ట్రేలియాలో ఇది భీకర వేసవి కాలం. ఉష్ణోగ్రతలు 48.9 డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్నాయి. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వేడి గాలులు వీస్తున్నాయి. దీంతో సెప్టెంబర్ 23 మొదలైన కార్చిచ్చు ఆస్ట్రేలియా అడవులను దహించివేస్తోంది. ఇప్పటివరకూ మంటలకు 24మంది మరణించారు. లక్షలాది జంతువులు కార్చిచ్చులో పడి చనిపోయాయి. లక్షల ఎకరాల అడవులు తగలబడి మంటల కారణంగా దాదాపు కొన్ని కోట్ల జీవరాశి నశించిపోయింది. కొన్ని అరుదైన జాతులు అంతరించిపోయాయి.

 

అడవుల మీద ఆధారపడి జీవించే మూగ జీవాలు సుమారు 48 కోట్ల వరకు మృత్యువాత పడ్డాయని తెలుస్తుంది.దావానంలో వ్యాపించిన కార్చిచ్చు కారణంగా క్షీరదాలు, అడవులలో నివసించే జంతువులు, సరీసృపాలు, ఉభయచరాలు, పక్షులు మృతిచెందినట్లు తెలుస్తుంది.

 

ఆస్ట్రేలియా ప్రభుత్వం మంటలను అదుపుచేయడానికి 3000 మంది సైనికులను రంగంలోకి దింపింది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మంటలను ఆర్పడానికి సహకరిస్తున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ కార్చిచ్చు ప్రాంతంలో పర్యటించి సహాయ సహకారాలు పర్యవేక్షిస్తున్నారు. వేలాది ఫైర్ ఇంజిన్లు విమానాలతో నీళ్లు చల్లుతూ మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: