జీవితంలో ఏదైనా దెబ్బ తగిలితే నిర్వేదం సహజం.. అలాంటి సమయాల్లో ఒక్కోసారి జీవితంపై విరక్తి పుడుతుంది. ఎందుకీ జీవితం అనిపిస్తుంది. బలహీన మనస్కులు ఆత్మహత్యాయత్నాలు చేస్తారు. కానీ జీవితంలో మార్పు తప్ప వేరేదీ శాశ్వతం కాదని గుర్తించుకోవాలి.

 

మార్పు అనేది సృష్టి సహజ స్వభావం. మార్పు అత్యంత సహజం. ఆ పరిణామక్రమంలో ప్రపంచం ముందుకు వెళ్తుంటుంది. చలనశీలంలోనే పురోగతి ఉంది. నిశ్చలంగా నిద్రించే చెరువుకు, నిరంతరం గలగలా ప్రవహించే గోదావరికి తేడా ఉంది కదా.

 

గోదావరి ఎక్కడో పుట్టినా.. తాను ప్రవహించే మార్గాన్నంతా సస్యశ్యామలం చేస్తుంది. చెరువు గ్రీష్మంలో ఎండి, వర్షరుతువులో మళ్లీ ఊపిరి పోసుకుంటుంది. జీవనదులు ప్రవహిస్తూనే ఉంటాయి. అజ్ఞానులు, అతిస్వార్థపరులు చెరువులాంటివారు. ఒక్కచోటే ఉండిపోతారు. మురుగుతో నిండిపోతారు.

 

అందరికీ తనతో పని ఉంటుంది, తన దగ్గరకే అందరూ వస్తారనుకుంటుంది చెరువు. అలా వచ్చినవారి పొగడ్తలు ఆశిస్తుంది. తన కారణంగానే వారికి ప్రాణరక్షణ జరుగుతోందనే అపోహతో అహంకరిస్తుంటుంది. నదులు అందుకు భిన్నం. ఈ జ్ఞానం కలిగి ఉంటే చాలు.. దేనిపైనా మనకు కోపం రాదు.. దేని గురించి నిస్పృహ కలగదు.

మరింత సమాచారం తెలుసుకోండి: