టెక్నాల‌జీ పెరుగుతున్న కొద్దీ మ‌నుషుల్లో మార్పులు కూడా చాలానే వ‌స్తున్నాయి.  పాశ్చాత్య సంస్కృతి వల్ల మన జీవన శైలిలో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జీవనం సాంకేతికాధీనమై పోయింది. సెల్‌ఫోనే సర్వస్వం అయిపోయింది. అది లేనిదే క్షణం గడవడం లేదు. చిన్నతనంలోనే అలవడుతున్న ఈ మొబైల్‌ ‘వ్యసనం’ జీవితంలో ఎన్నింటికో దూరం చేస్తుంది. మరీ ముఖ్యంగా జీవితాన్ని వికసింపజేసే పుస్తక పఠనం తగ్గిపోతోంది. ఇది వ్యక్తిగతంగానే కాదు, సామాజికంగానూ ఎంతో నష్టం కలుగజేస్తుంది.


 
ఒక‌ప్పుడు పిల్లలు అమ్మ ఒడి నుంచే అభ్యాసాన్ని ప్రారంభించేవారు. అందుకని, బాల్యం నుంచే పుస్తక పఠనాన్ని అలవాటు చేయాలి. ‘చిరిగిన చొక్కా అయినా వేసుకో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో’ అన్న వీరేశలింగం మాటలను అనుసరిస్తూ చిన్నారులకు చిన్నప్పటి నుండే కథలు చెప్పడం, ‘చదవడం’ నేర్పుతూ పెంచాలి. ఆ విధంగా అమ్మ ఒడి నుంచే మంచి పిల్లలకు మంచి అలవాట్లను తల్లిదండ్రులు నేర్పిస్తుండాలి. పుస్తకాలను చదవడం తప్పనిసరిగా అలవాటు చేయాలి. పుస్తక పఠనం పిల్లల్లో జ్ఞానాన్ని పెంచుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మానసిక సమస్యలు దూరం అవుతాయి. మెదడుకు మేత దొరుకుతుంది. అది ‘రిలాక్స్’ అయి, పునరుత్తేజమవుతుంది. వారిలో కార్యశీలత పెరుగుతుంది.

 

పిల్లలు కథలంటే ఇష్టపడతారు. మొదటగా వారికి చిన్న చిన్న కథలు చదివి వినిపిస్తుండాలి. చిత్రాలతో కూడిన ఆసక్తికర పుస్తకాలను వారి చేత చదివించాలి. ఇలా చేయడం వల్ల తమకు తెలియకుండానే పుస్తకాల పట్ల ఆకర్షితులవుతారు. కొత్త కొత్త పదాలను నేర్చుకుంటూ, సరికొత్త విషయాల్ని తెలుసుకుంటారు. ఆవిధంగా వారు భాషా, విషయ పరిజ్ఞానాలు పెంచుకుంటారు. పిల్లల చేత పుస్తకాలను చదివించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదే కీలక పాత్ర. పిల్లల చేత గేయాలు చదివిస్తూ అభినయం చేయించాలి. చిన్నారుల ఇష్టానికి తగినట్టుగా పుస్తకాలను ఎంపిక చేసుకొని చదివేలా ప్రోత్సహించాలి. పఠనం పిల్లలకు నేర్చుకోవడంలో మెళకువలు నేర్పిస్తుంది.

 


పిల్లల కోసమే పత్రికలు ప్రత్యేక పేజీలు, శీర్షికలు ఇస్తున్నాయి. వాటిలో క్రాస్‌వర్డ్, పజిల్స్, చుక్కలను కలపడం, ఆకారాలను తయారు చేయడం వంటివి బాలబాలికలతో చేయిస్తూండాలి. ఇవి మెదడుకు బాగా పదునుపెడతాయి. జానపద కథలు, సామాజిక కథలను చదివించాలి. కథలను చదివి వినిపించడం ద్వారా తల్లిదండ్రులు, పిల్లలతో అనుబంధాలు పెంచుకోగలిగి, వారి అటెన్షన్‌ను మార్చగలుగుతారు. అనుబంధాల విలువలు, కుటుంబం పట్ల గౌరవం, మనుషుల మధ్య ఉండే ప్రేమ, ఆప్యాయతలను నేర్చుకుంటారు. జీవితంలో ఎదగడానికి కావాలసిన ఎన్నో గుణగణాలు పుస్తక పఠనం ద్వారా పిల్లలకు అబ్బుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: