సంక్రాంతి సంబరాల కోసం ఉభయ గోదావరి జిల్లాలు సిద్దమవుతున్నాయి. బరిలో దిగేందుకు పందెం కోళ్లు ఇప్పటికే యుద్దానికి సై అంటున్నాయి. మరోవైపు పందెం రాయుళ్లపై ఉక్కుపాదం మోపడానికి సిద్ధమయ్యారు పోలీసులు. బైండోవర్‌ కేసులు నమోదువుతున్నా.. కోడిపందాల నిర్వహకులు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

 

సంక్రాంతి పండగ దగ్గరికొచ్చింది. సంక్రాంతి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందాలే. కోడి పందాలు వద్దనీ.. జీవ హింస తగదని కోర్టులు ఎంతగా వారిస్తున్నా... పోలీసులు అడ్డుపడుతున్నా పందెం రాయుళ్లు మాత్రం ఆగడం లేదు. పండుగ వేళ పందెంరాయుళ్లకు పగ్గాలు వేయడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. కోనసీమలో ఈ ఏడాది 321 చోట్ల పోలీసులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్ఛు. 

 

కోడిపందేల నిర్వహణకు పందెపు రాయుళ్లు ఒకే  చోటికి చేరే విధంగా ప్రస్తుతం గ్రామాల్లో సన్నాహక పందేలు జోరుగా సాగుతున్నాయి. ఈ తతంగం జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతోంది. భారీ ఏర్పాట్లు లేకపోయినా.. చిన్న బరుల్లో పందేలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా కోడిపందేలపై ఉక్కుపాదం మోపుతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కానీ పండుగ చివరి రోజుల్లో చూసీచూడనట్లు వ్యవహరించడం ఆనవాయితీగా మారింది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉంటుందని.. పందేల నిర్వహణకు ఢోకా ఉండదన్న ధైర్యంతో నిర్వహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. ఇప్పటికే సంక్రాంతి సందర్భంగా ఎక్కడ బరులు పెట్టాలనే దానిపై నిర్వాహకులు ఓ స్పష్టతకు వచ్చారు.

 

కోడిపందాల నిర్వహణకు ఇప్పటికే పలు చోట్ల భారీ సంఖ్యలో కోడిపుంజులను సిద్ధం చేస్తున్నారు. కోనసీమలోని పలు మండలాల్లో ఏడాది క్రితం నుంచే ప్రత్యేకంగా శిబిరాలను ఏర్పాటు చేసి  మరీ పెంచుతున్నారు. వీటిలో పదుల నుంచి వందల సంఖ్యలో రకరకాల కోడిపుంజులు ఉన్నాయి. కోడి పందేల కోసం ఆక్వా చెరువుల వద్ద సైతం పెద్ద ఎత్తున కోడి పుంజులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి పెంచుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ పందాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మోటారు సైకిళ్లు వదిలి పందెపురాయుళ్లు తప్పించుకోవడం కనిపిస్తోంది. కత్తులు కట్టే వారిని గుర్తించి బైండోవర్‌ కేసులు పెడుతున్నారు. సంప్రదాయాల ముసుగులో కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్‌ అధికారులు హెచ్చరిస్తున్నారు. 

 

పందాలకు చెక్‌ పెట్టడంలో భాగంగా మొన్న కోడి కత్తుల తయారుచేసే కేంద్రాలపై, నేడు కోళ్ల అమ్మకాలపై దృష్టి సారించారు పోలీసులు. పలు చోట్ల దాడులు చేసి కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీస్‌ స్టేషన్‌లు కోక్కోరోకో అరుపులతో దద్దరిల్లుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: