సంక్రాంతి పండుగకు పల్లెలతో పోటీపడుతోంది హైదరాబాద్ మహానగరం. సంకాంత్రికి చాలామంది గ్రామాలబాట పట్టడంతో భాగ్యనగరం రోడ్లు బోసిపోయి కనిపిస్తాయి. కానీ హైదరాబాద్ లో మాత్రం పతంగులు ఎగురవేయడం పెద్ద పండుగే. అంతేకాదు సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ప్రపంచవ్యాప్తంగా కైట్ ప్లేయర్స్ హైదరాబాద్ కు వస్తుంటారు.

 

సంక్రాంతి అంటే కొత్త పంటలు ఇంటికొస్తాయి. ఇంటినిండా ధాన్యం నిండుతుంది. హైదరాబాద్ లో మాత్రం సరికొత్త పతంగులు సందడి చేస్తాయి. సంక్రాంతి సందర్భంగా గాలిపటాలను ఎగురవేయడం హైదరాబాదీలకు సంప్రదాయంగా వస్తోంది. స్కూల్స్ కు సంక్రాతి సెలవులు ఇస్తే చాలు పతంగులు పట్టుకుని ఇంటి డాబాపైకి చేరటం కామన్. పిల్లలతో పాటు యువకులు సైతం వీటిని ఎగురవేస్తూ సంబరాలు చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో విభిన్న ఆకారాల్లో, వినూత్న రంగుల్లో గాలిపటాలు మార్కెట్ లో  దర్శనమిస్తున్నాయి. కొన్నిచోట్ల గాలిపటాల పోటీలు కూడా పెడతారు. ప్రతి సంవత్సరం జనవరి 14న ఈ పంతంగుల వేడుక ఉంటుంది. ఈసారి ఫిల్మ్ స్టార్స్ పతంగులు, మోడీ, కేసీఆర్, అమిత్ షా పతంగులు, పబ్లీ, డోరేమాన్ పతంగులు సందడి చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా పది రోజుల ముందుగానే సందడి నెలకొందని వ్యాపారులు చెబుతున్నారు. 

 

పతంగుల బిజినెస్ కి కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్ లోని ధూల్ పేట్. మన రాష్ట్రం నుంచే కాదు.. దేశం నలుమూలల నుంచి గుల్జార్ హౌస్, ధూల్ పేట్ కి వచ్చి పతంగులు కొనుగోలు చేస్తారు. ఇక్కడి నుండి ఇతర దేశాలకు కూడా వీటిని ఎగుమతి చేస్తారు. అంగుళం సైజు నుంచి మొదలు షట్టర్ సైజు దాకా పతంగులు, చరాక్,మాంజాలు, లభిస్తాయి. సంవత్సరం మొత్తం నడిచే బిజినెస్ లో ఒక జనవరి లోనే 70 శాతం గాలిపటాలు అమ్ముడుపోతాయని సమాచారం. వేల రకాల డిజైన్లలో పతంగులు ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ పతంగులు చాలా తక్కువ ధరకు లభిస్తాయి.

 

ధూల్ పేట్ అంటే కేవలం వినాయక విగ్రహాలే కాదు పంతంగులకు పెట్టింది పేరు..ఇక్కడ ఈ వృత్తిని నమ్ముకుని వందల కుటుంబాలు ఆధారపడి ఉన్నారు. అయితే ఇందులో మాంజా అనేది చాలా కీలకం.ముందుగా కొన్ని దారాలను ఎంచుకొని ఆ దారాలకు గాజు పెంకులు, అన్నం, జిగురు,కలబంద, బ్రహ్మజెముడు గుజ్జును కలిపి ముద్దగా చేస్తారు. ఈ ముద్దను దారానికి పట్టించడం వల్ల మాంజా మంచి పటుత్వం కలిగి ఉంటుంది. గతేడాది నుండి చైనా నుండి దిగుమతి అయ్యే ప్లాస్టిక్ మాంజాలను ప్రభుత్వం నిషేధించడంతో లోకల్ ప్రోడక్ట్ కు మంచి ఆదరణ లభిస్తోందని అంటున్నారు వ్యాపారులు. ఎవరో కొంతమంది చేసే పనుల కారణంగా ఒరిజినల్ ప్రొడక్ట్ అమ్ముతున్న వ్యాపారులకు ఇబ్బందిగా ఉంటోందనే అభిప్రాయం వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: