పండుగలు అన్నిటిలోనూ సంక్రాంతి పండుగకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. సాంప్రదాయాలు, వేడుకలు, పోటీలు, పిండి వంటలతో బంధువులంతా కలిసి ఆనందంగా మూడు రోజులపాటు చేసుకునే ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అందుకే  సంక్రాంతి పండుగను పెద్ద పండుగ పిలుస్తారు. ఇక సంక్రాంతి పేరు చెబితే ఆంధ్రాలో కోడిపందాలు, తెలంగాణలో గాలిపటాలు బాగా గుర్తుకు వస్తాయి. ఎవరికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, కష్టాలు ఉన్నా సంక్రాంతి పండుగ అవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఆనందంగా బంధువులతో ఈ పండుగను జరుపుకుంటారు.


 ఇంకా పల్లెటూర్లో అయితే చల్లని గాలులు మధ్య ప్రతి ఊరు, ప్రతి ఇల్లు, ధాన్యపు రాశులతో నృత్యాలతో, గంగిరెద్దు విన్యాసాలు, హరిదాసు చప్పుళ్ళతో సందడి సందడిగా కనిపిస్తుంది. పౌరుషానికి పదును పెడుతూ కోడిపందాలు, బొమ్మల కొలువులు, ఉదయాన్ని ఆస్వాదిస్తూ భోగి మంటలు ఆనందాన్ని తీసుకు వస్తూ ఉంటాయి.ఇక సంక్రాంతికి పిండి వంటల గురించి గురించి చెప్పుకోవాలంటే... ఎంత మంది బంధువులు వచ్చినా, ప్రతి ఇళ్లలోనూ వెజ్, నాన్ వెజ్ వంటకాలు ఊరిస్తూ ఉంటాయి. నాటు కోడి తో విందు అయితే సరే సరి.


అయితే అంతగా ప్రాధాన్యం ఉన్న సంక్రాంతి నేడు మారుతున్న ఆధునిక కాలానికి తగినట్టుగా మారిపోతూ క్రమక్రమంగా ప్రాధాన్యతను కోల్పోతోంది. ఇళ్లలో పిండి వంటలు చేసుకునే అంత తీరిక లేక బజారులో షాపులో ప్యాకెట్లో పిండివంటలు తీసుకువచ్చే సంస్కృతి ఎక్కువ అయిపోయింది. ఇక బంధువులందరికీ వండి పెట్టే అంత ఓపిక లేక కేటరింగ్ లకు ఆర్డర్ ఇచ్చే సంస్కృతి పెరిగిపోయింది. 


 అంతకుముందు సంక్రాత్రి పండుగ అంటే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఇలా అందరూ ఒకచోట చేరి ఒకరి తర్వాత ఒకరు ఒకే పొయ్యి మీద పిండివంటలు చేసుకుంటూ తమ శ్రమను పంచుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఇల్లు ఇరుకవుతున్నట్టే తమ మనసులను కూడా ఇరుకు ఇరుకుగా చేసేసుకుంటున్నారు. ఎవరికి వారు రెడీమేడ్ వంటకాలకు ప్రాధాన్యం ఇస్తూ సంక్రాంతి పండుగ కళను తగ్గిన చేస్తున్నారు.

 

ఈ ప్రభావం రోజురోజుకు ఎక్కువవుతోంది. భావితరాలు కూడా ఈ పండుగను మరిచిపోయే అవకాశాలు ఏర్పడుతున్నాయి. అసలు సంక్రాంతి వంటకాలంటే కేటరింగ్ లతో సరే అన్నట్టుగా పరిస్థితి తయారవడం తెలుగు సంప్రదాయానికి పెద్ద మచ్చగా తయారైందని తాతలు, బామ్మలు తెగ బాధపడిపోతున్నారు. 

 

అదే మా రోజుల్లో అయితే ... అంటూ తమ కాలంలో పండుగ ఎలా జరుపుకునే వారిమో నేటి తరానికి చెబుతూ ఇప్పుడు జరుపుకుంటున్న పండుగలకు అలవాటు పడిపోతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: