మన దేశ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం తెలుగు ప్రజలు జరుపుకొనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు.. ఇలా సంకాంత్రి వచ్చిందంటే ఆ సందడే వేరు. ఈ పండుగ తొలి రోజును 'భోగి'గా పిలుస్తారు. రెండో రోజును 'మకర సంక్రాంతి'గా, మూడో రోజును 'కనుమ' గా పిలుస్తారు. నాలుగో రోజును 'ముక్కనుమ' అంటారు.


భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్ధం. పాడి పంటలు సమృద్ధిగా ఇండ్లకు వచ్చే కాల సమయం. భోగి రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి అనంతరం ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేసుకొని పాతకు స్వస్తి చెప్పి కొత్తదనానికి స్వాగతం పలుకుతూ.. భోగి మంటలలో పాత పనికిరాని బట్టలను, వస్తువులను వేసి పీడలను, అరిష్టాలను తొలగించుకుంటారు.  


భోగి రోజు చేసే బొమ్మల కొలువు, ముత్తైదువులతో పేరంటం కూడా చేస్తారు. ముఖ్యంగా భోగి పండుగ రోజు పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగిపళ్లు పోస్తారు. భోగిపండ్ల కోసం రేగుపండ్లు, చెరుకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు వాడతారు. కొందరు శనగలు కూడా కలుపుతారు. రేగి పళ్లను పిల్లల తల మీద పోడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపొతుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాని ప్రేరేపితం చేస్తే, పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందనే నమ్మకం.


రేగి పండ్లను బదరీఫలం అని కూడా పిలుస్తారు. శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి.

మరింత సమాచారం తెలుసుకోండి: