హిందువుల‌కు అని పండుగ‌ల‌లో సంక్రాంతి అతి పెద్ద పండుగ‌. ఈ పండుగ‌కు ఊళ్ల‌ల్లో దాదాపు ప‌న్నెండు రోజుల ముందు నుంచే హ‌డావిడి మొద‌లైపోతుంది. తెల్ల‌వారు జామునే చ‌లిలో అంద‌రికంటే ముందే నేనే ముగ్గెయ్యాలి అన్న‌ట్లు పొద్దున్నే ముంగిళ్ళ‌న్నీ రంగురంగుల ముగ్గుల‌తో నిండిపోతాయి. చ‌క్క‌టి గోమాత పేడ‌ను తీసుకువ‌చ్చి క‌ళ్ళాపు చ‌ల్లిమ‌రీ ముగ్గులు వేస్తారు.  భోగి నుంచి మొదలుకొని మకర సంక్రాంతి ఆ తర్వాత కనుమ.. ఇలా మూడు రోజులు మూడు విధాలుగా పండుగను జరుపుకొని ఒక్కోరోజుకి ఒక్కో విశిష్ట‌తతో చేస్తారు.  ఈ మూడు రోజులు ఒక్కోరోజు ఒక్కో ప్రాధాన్య‌త క‌లిగి ఉంటుంది. 

 

పిల్లలకు భోగిపండ్లుగా పోసేందుకు చిన్న రేగుకాయలను వాడతారు. ఈ రేగుకాయలకు బదరీఫలం అన్న పేరు కూడా ఉంది. పూర్వం నరనారాయణులు ఈ బదరికావనంలోనే శివుని గురించి ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణునిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని మ‌న పూర్వీకులు చెబుతుంటారు. 

 

నిత్యం కేరింతలు కొడుతూ చిలిపి కృష్ణుని తలపించే పిల్లలకి దిష్టి తగులుతుందేమో అని పెద్దలు భావించడం సహజం. దీని కోసం ఉప్పు దిష్టి, గంటం దిష్టి, కొబ్బరికాయ దిష్టి... ఇలా రకరకాలుగా దిష్టి తీసేస్తుంటారు. అలా భోగిపండ్లను కూడా పిల్లలకు ఉన్న దిష్టిని దూరం చేస్తాయని నమ్ముతారు. అందుకే పిల్లవాడిని భోగిపండ్ల వేడుక కోసం కూర్చుండబెట్టిన తర్వాత, ముందుగా తల్లి అతనికి బొట్టు పెట్టి తల చుట్టూ ముమ్మారులు దిష్టి తీస్తూ భోగిపండ్లను పోస్తుంది. అంతేకాక శివుడికి ఇష్టమైన పండు కూడా ఆ  రేగు పండే. రాముడు కూడా శబరి ఎంగిలి చేసిన రేగు పండునే తింటాడు. ఇలా ప్రతి చోట మన సంస్కృతిలో భాగమైపోయింది రేగు పండు. అందుకే.. పిల్లలకు భవిష్యత్తులో ఎటువంటి బాధలు కలగకూడదని… ఎటువంటి సమస్యలు రాకూడదని భోగి పండుగ రోజున రేగు పండ్లతో దీవిస్తారు. ఆ తరువాత ముత్తయిదువలకు కూడా పిల్లవాడి తల మీదుగా పడేట్లు భోగిపండ్లను పోస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: