సందడే సందడి ! ఎక్కడ చూసినా సంక్రాంతి సందడి కనిపిస్తోంది. పల్లెలన్నీ పండగ వాతావరణాన్ని ఎప్పుడో తీసుకొచ్చేసినట్టుగా, ప్రతి ఇల్లు చుట్టాలతో కలకలలాడుతూ సంక్రాంతికి ముస్తాబై పోగా, పట్టణాలన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. రోడ్లు, షాపులు  ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలనంతగా జనాలు నిండిపోయి కనిపిస్తున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో సంక్రాంతికి కనిపించే సందడి అంతా ఇంతా కాదు. ఈ పండుగ పేరు చెబితే పిండి వంటలు, కోడిపందాలు మొదటగా గుర్తుకు వస్తాయి. ప్రతి చోటా భోగి మంటలు వేస్తూ, ప్రతి ఇంటి ముంగిట గొబ్బెమ్మలతో గోదావరి జిల్లాలు కళకళలాడుతూ ఉంటాయి. అయితే అసలు సంక్రాంతి అంటే కోడిపందాలు అన్నట్టుగా ఇక్కడ వాతావరణం ఉంటుంది. 


కోడిపందాలతో పాటు గుండాట, పేకాట, కొత్తగా కెసినో గేమ్స్,  ఇలా సరికొత్త ఆటలతో కోడి పందాల శిబిరాల కళకళలాడుతున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా పండుగ మూడు రోజులు కోడి పందాలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా కోడిపందాలు పేరు చెబితే మొదటగా గుర్తుకువచ్చే పేరు భీమవరం. ఈ ప్రాంతంలో కోడి పందాలు వేసేందుకు, చూసేందుకు దేశం నలుమూలల నుంచి తండోప తండాలుగా జనాలు వస్తారంటే ఇక్కడ వాతావరణం ఏ విధంగా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఇక మీడియా కూడా లైవ్ కవరేజ్ ఇస్తూ కోడి పందాలు చూపిస్తూ మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుంటారు. 


భీమవరం లో ఈ రోజు నుంచి కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో వ్యవసాయ భూముల్లో సైతం కోడిపందాలు నిర్వహించే వారు. కానీ వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ భూముల్లో పందాలు వేసేందుకు అనుమతి నిరాకరించడంతో పోడు భూముల్లో బరులు ఏర్పాటు చేశారు. ఒక్కో బిరికి సుమారు 25 లక్షలకు పైగా చెల్లిస్తున్నట్టు సమాచారం. కోడిపందాలతో పాటు చుట్టు, పేకాట, గుండాట కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఇక కోడిపందాలను అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కోడి పందాలు నిర్వహించవద్దు అంటూ పల్లెల్లో, పట్టణాల్లో మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీంతోపాటు కోడిపందాలు నిర్వహించకుండా కమిటీలను ప్రభుత్వం వేసింది.


 ఈ కమిటీలు ఇప్పటికే గోదావరి జిల్లాల్లో తిరుగుతూ ఉన్నారు. కోడి కత్తులు ఎక్కడ కనిపించినా పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే ప్రతి సంవత్సరం పోలీసులు ముందుగా ఈ విధంగా హడావుడి చేయడం పండుగ మూడు రోజులు చూసీచూడనట్టుగా సైలెంట్ అయిపోవడం సర్వ సాధారణంగా జరిగే తంతేనని పందెం రాయుళ్లు ధీమాగా చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: