సంతోషం ఎక్కడ మొదలవుతుంది.. దీనికి ప్రపంచం ఎలాంటి సమాధానం చెప్పినా ఇండియా మాత్రం కుటుంబం నుంచే అని చెబుతుంది. మన దేశంలో కుటుంబ వ్యవస్థ గొప్పదనం అది. ముందు కుటుంబం ఆనందంగా ఉంటే.. అదే సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. కొన్ని వేల, లక్షల కుటుంబాల కలయికే కదా దేశం అంటే.

 

మరి ఆ కుటుంబం ఆనందంగా ఉండాలంటే.. భార్య భర్తల మధ్య సమన్వయం ఉండాలి. అవగాహన ఉండాలి. జీవిత భాగస్వాములు మధ్య అవగాహన, సర్దుబాటు లేకపోతే.. ఆ కుటుంబంలో సంతోషం కనిపించదు. వివాహ బంధం అంటే ఒకరికి ఒకరు లొంగి ఉండటం కాదు. ఒకరిపై మరొకరికి ప్రేమ పొంగుతుండాలి.

 

భార్యాభర్తల ప్రేమసౌరభంతోనే గృహసీమ స్వర్గసీమగా మారుతుంది. సమాజానికి ప్రశాంతతను పంచుతుంది. ప్రతి ఇల్లూ స్వర్గంగా మారి సుఖసంతోషాలతో వర్థిల్లుతుంటే సమాజం కూడా ప్రశాంతంగా మానవీయ పవనాలు వీస్తుంది కదా. దేశ ప్రగతికి కావాల్సింది అదే. అందుకే ఈ దేశ సేవ, సమాజసేవ అంటూ మాట‌లాడే వారు ముందు తమ కుటుంబం నుంచే దాన్ని ప్రారంభించాలి.

 

విశ్వజనీన కుటుంబంగా భావించి శాంతిని కాంక్షించేవారు ఎవరైనా.. ఆ శాంతిని తమ ఇంటి నుంచే ప్రారంభించాలి. భార్యాభర్తల సమన్వయంతోనే.. పరస్పర సహకారంతోనే అది సాధ్యమవుతుంది. అందుకే భారత దేశానికి కుటుంబమే పునాది. ఈ విషయం మరవకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: