యావత్ తెలుగు ప్రజలకి పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతిలో ముందు రోజున వచ్చేది 'భోగి' పండుగ. మూడు రోజుల పాటు జరిగే పండుగలో మొదటి రోజు 'భోగి'. భోగి పండుగ అనే పదానికి 'తొలినాడు', మొదటిరోజు అనే అర్ధం ఉంది. అనగా పండుగ తొలినాడు అని అర్ధం. భోగి రోజున ఇంటి ముందర మంట వేస్తే ఇంటిలో ఉండే దారిద్ర దేవతను తరిమినట్లేనని హిందువుల నమ్మకం.. విశ్వాసం. 

 

దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు. 'భగ' అనే పదం నుంచి  భోగి అన్నమాట పుట్టిందని మన పూర్వీకులు చెబుతారు. 'భగ' అంటే 'మంటలు' లేదా 'వేడి'ని పుట్టించడం అని అర్ధం. దక్షిణాయనంలో ప్రజలు పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలే భోగిమంటలు. కుప్పలు నూర్పిడి అవగానే మిగిలిన పదార్ధాలను మంటగా వేయటం వలన పుష్యమాస లక్షణమైన చలి తగ్గి వాతావరణం కొంచెం వేడెక్కుతుంది. 

 

భుగ్ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం ఈ రోజున శ్రీ రంగనధాస్వామి లో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని... దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాధ. శ్రీ మహా విష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన పురాణ గాథ మనందరికీ తెలిసిందే. తరువాత బలి చక్రవర్తికి పాతాళ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుంచి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశిర్వదించమని వరమివ్వడం జరిగిందట. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో ఉంది. కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతూ... గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు ఇదేనని శెలవిచ్చాడు. శాపవశంగా పరమేశ్వరుని వాహనమయిన బసవన్నను భూమికి పంపించి రైతుల పాలిట దైవాన్ని భూమికి దిగి వచ్చిన రోజు ఇదే అనేవి కూడా పురాణాల గాథలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: