కోడి పందాలు గుండాట పేకాట ఇవన్నీ చట్టవ్యతిరేకమైన ఆటలని, వీటికి పోలీసులు అనుమతి లేదని, ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు పోలీసులు మైకుల ద్వారా చెప్పిస్తూ హడావిడి చేయడం ఆ తరువాత చూసీచూడనట్టుగా వదిలేయడం ప్రతి సంక్రాంతి సీజన్లో షరా మామూలుగానే నడుస్తున్న వ్యవహారం. అయితే ఈసారి ఏపీలో కొత్తగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, జగన్ కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా వెనుకాడకపోవడం తో పందేలు జరుగుతాయా లేదా అనే సందేహం అందరిలోనూ వ్యక్తమవుతోంది.


 పర్మిషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాదని కొంతమంది హడావుడి చేస్తూనే ఉన్నారు. దీనికి తగ్గట్టుగానే కోడి పందాలు బిరులను దున్నివేయిస్తూ, టెంట్లు పీకేయిస్తూ ఇలా పోలీసుల హడావుడి కనిపిస్తోంది. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో సంక్రాంతి మూడు రోజులపాటు కోడి పందాలు ఆ జిల్లాలకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. వీటిని చూసేందుకు దేశం నలుమూలల నుంచి ముందుగానే ఈ జిల్లాలకు తరలివస్తుంటారు. అయితే ఇప్పటి వరకు పోలీస్ పర్మిషన్ ఈ పందాలకు రాకపోవడంతో ఏదో రకంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పర్మిషన్ ఇప్పిస్తామని నాయకుల హడావుడి చేస్తూ భరోసా కల్పిస్తున్నారు. 

 

పశ్చిమగోదావరి జిల్లా విషయానికి వస్తే భీమవరం, జువ్వలపాలెం, జంగారెడ్డిగూడెం, పాలకొల్లు, కలగంపూడి తదితర చోట్ల భారీ ఎత్తున పందేలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ఈ జిల్లాలో సుమారు 400 వరకు కీలకమైన బారులు ఉన్నట్టుగా తెలుస్తోంది.   గతంలో కోడిపందాలకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో పోలీసులు ఇప్పుడు వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున దాడులు చేసి 635 కేసులు నమోదు చేసి 2730 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. కోడిపందాల నిర్వహణ ప్రతిష్టాత్మకంగా మారడంతో వీటి పర్మిషన్ కోసం నాయకులపై ఒత్తిడి చేస్తున్నారు. ఇక పందెం పుంజులు యుద్దానికి సిద్ధంగా ఉన్నాయి.

 

మెట్టతోక కోడి మెరుస్తుందని కొంతమంది.. లేదు లేదు నెమలి కోడి నెగ్గుతుందని మరికొందరు అప్పుడే సవాళ్లు విసురుకుంటున్నారు. గోదారి గ్రామాల్లో ఇప్పుడెక్కడ చూసినా కోడి పందేల కబుర్లే.   కాకి, సీతువా, నెమలి, పర్ల, డేగ ఇలా అనేక రకాల జాతుల కోళ్లు పందేలకు రెడీ అయ్యాయి. రంగులను బట్టి ముహూర్తాలు చూసుకుని మరి పందాలు నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకు వీటి నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి పోలీసులకు ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో అసలు ఈ పందాల నిర్వహణకు పర్మిషన్ వస్తుందా ? రాదా అనే ఉత్కంఠ ఉన్నా తమ పందెం పుంజులను పట్టుకుని అప్పుడే రోడ్డెక్కేసారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: