గిరిజనుల జీవితాలను దగ్గరగా చూడాలనుందా?  వీలైతే గిరిజనుల్లా ఒక్క రోజైనా ఉండాలనుకుంటున్నారా? అరకులో ఈ అద్భుత అవకాశం అందుబాటులోకి వచ్చింది. గిరిజనుల కట్టుబట్టనుండి వివాహ వేడుక వరకు టూరిస్టులకు అందుబాటులోకి తెచ్చింది ఏపీ సర్కారు. విశాఖ ఏజెన్సీలో పర్యాటకులను ఇప్పటి వరకూ ప్రకృతి సోయగాలు మాత్రమే కనువిందు చేస్తే, ఇప్పుడు గిరి పుత్రుల జీవితాలను అత్యంత సమీపం నుంచి చూస్తూ అనుభవించే అవకాశం అందుబాటులోకి వచ్చింది.

 

గిరిజనులు ఎలాంటి ఇళ్లలో ఉంటారు.. ఉదయం నుండి రాత్రి వరకు ఎలా గడుపుతారు? ధాన్యం ఎలా సిద్ధం చేసుకుంటారు?
ఆచారాలేమిటి? పెళ్లి ఎలా చేసుకుంటారు.. ఇవన్నీ పుస్తకాల్లో దొరుకుతుంది.. లేదా.. గిరిజన గ్రామాలకు దగ్గరగా ఉంటే తెలుసుకునే వీలుంటుంది. కానీ అలాంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తే... మైదాన ప్రాంత వాసులకు అది ఖచ్చితంగా కొత్త అనుభవంగా మిగులుతుంది. గిరిగ్రామదర్శిని  సరిగ్గా ఇదే లక్ష్యంతో రూపొందించారు. గిరిజన జీవన విధానంలో ఒక రోజు గడిపే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆంధ్రా ఊటీ అరకులో ఈ అద్భుత ప్రాజెక్ట్ నడుస్తోంది.

 

అరకులోయ అనగానే పచ్చటి కొండలు, లోతైన లోయలు,  మనకు జాలువారే జలపాతాలు, పచ్చని  వలిసె పూల అందాలు, మెలికలు తిరిగే రైలు ప్రయాణం గుర్తుకొస్తాయి. వీటి సరసన చేరే విధంగా వినూత్న ప్రాజెక్ట్ ఇప్పుడు అందుబాటులోకి  వచ్చింది. అరకు లోయను సందర్శించే పర్యాటకులకు మరపురాని అనుభూతిని మిగిల్చేలా గిరి గ్రామదర్శిని రూపుదిద్దుకుంది.

 

అరకులోయకు కూతవేటు దూరంలో  గిరిజన సంప్రదాయాన్ని అనుసరిస్తూ, అధునాతన రీతిలో గిరి గ్రామదర్శినిని గంజాయి గూడ గ్రామంలో నిర్మించింది ఏపీ ప్రభుత్వం. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు, వారి ఆచార వ్యవహారాలు కట్టుబొట్టు జీవనశైలిని మన కళ్ళముందు నిలిపే విధంగాగిరి గ్రామదర్శిని ఆకట్టుకుంటోంది.

 

గిరిజన మహిళల కట్టు బొట్టు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీంతో పర్యాటకులకు సాంప్రదాయ గిరిజన వస్త్రధారణ అవకాశం ఇస్తున్నారు. 300 రూపాయలు చెల్లించి చీర కట్టుకోవడమే కాకుండా వారి ఆభరణాలను అలంకరించుకుని సరదా తీర్చుకోవచ్చు. అరకు లోయకు 5 కిలోమీటర్ల దూరంలో చిన్న కొండలు, వాగుకు దగ్గరలో  రహదారిని ఆనుకొని
 గిరిజనులు నివసించే విధంగా పూరిల్లులతో సరికొత్త తరహాలో ఈ గ్రామాన్ని నిర్మించారు. పెదలబుడు ఎకో టూరిజం సభ్యుల ఆధ్వర్యంలో దీనిని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.  ఎద్దుల బండి పై సవారి, రాగి అంబలి, ఆర్చరీ కేంద్రం, బొంగరం ఆట, కొమ్మ రాట్నం, థింసా ఆడుకునేందుకు ప్రత్యేక స్థలం, కోళ్లను పట్టుకోవడం, నాగలి పట్టి దుక్కిదున్నడం....ఒకటేమిటి ఇలా లెక్కలేనన్ని అంశాలు గిరి గ్రామదర్శినిలో ఉంటాయి. ఒక్కమాటలో చెప్తే... ఈ గ్రామంలోకి అడుగుపెట్టిన వారంతా, తామూ గిరిజనులే అని భావించేలా ... గిరిజన జీవినశైలిలోకి తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేశారు.

 

అన్నిటికి మించి గిరిజన సాంప్రదాయ వస్త్రధారణలో టూరిస్టులకు వివాహ వేడుక అవకాశాన్ని కూడా ఇస్తున్నారు. జీవితంలో ఓ తీపిగుర్తుగా మిగిలిపోయేలా, ఈ పెళ్లి వేడుకను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం పర్యాటకుల నుండి పదిహేను వందల రూపాయలు వసూలు చేస్తున్నారు. పాడేరు ఐటీడీఏ పీవో డీకే బాలాజీ గ్రామదర్శిని లో ఇటీవలే తన వివాహ వేడుక జరిపించుకున్నారు. 

 

ఓవరాల్ గా అరకు పర్యటనలో యాత్రికులకు, గిరి గ్రామ దర్శిని ఓ అందమైన అనుభూతిని మిగిల్చేలా రూపుదిద్దుకుంది. ప్రకృతి అందాల నడుమ,  గిరిజనుల జీవితాలను అనుభూతి చెందేలా జీవిత కాలపు గుర్తులను మిగులుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: