సంక్రాంతి వరసలో వచ్చే చివరి పండగను కనుమ పండగ అంటారు దీన్నె పశువులు పండగ అని కూడా అంటారు. ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు వెట్టి చాకిరి చేసిన మూగజీవాలైన పశువులకు ఈ రోజు పండుగే. సంక్రాతి పండుగలో మూడోరోజు కనుమ. కనుమ పండుగ అంటే అందరికీ ఇష్టమే.  కనుమ ను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు.  ఆ రోజు అడవి నుంచి సేకరించిన కొన్ని చెట్ల ఆకులు, కొన్ని చెట్ల బెరుడులు, కొన్ని, చెట్ల పూలు, వేర్లు, కాండాలు, గడ్డలు చిన్న ముక్కలుగా కత్తిరించి, ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచు తారు.

 

అదంతా మెత్తటి పొడిలాగ అవుతుంది. దీన్ని ఉప్పు చెక్క అంటారు ఇది అత్యంత ఘాటైన మధుర మైన వాసనతో వుంటుంది. దీన్ని పశువులకు తిని పించాలి. ఇదొక పెద్ద ప్రహసనం. అవి దీన్ని తినవు. అంచేత ఒక్కొక్క దాన్ని పట్టుకొని దాని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను చారెడు పోసి దాని నోరు మూస్తారు. కనుమ రోజు  ఏడాది కొకసారి ఈ ఉప్పుచెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారణి అని వీరి నమ్మకం. ఆ తర్వాత పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని, చెరువుల వద్దకు గాని తోలుక పోయి, స్నానం చేయించి, లేదా ఈత కొట్టించి, ఇంటికి తోలుకొస్తారు.

 

ఆ తర్వాత వాటి కొమ్ములను, పదునయిన కత్తితో బాగా చెలిగి వాటికి రంగులు పూస్తారు. మంచి కోడెలున్న వారు వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి. మెడలో మువ్వల పట్టీలు, మూతికి మూజంబరాలు అలంకరిస్తారు. అన్నింటికి కొత్త పగ్గాలు వేస్తారు. ఈ సమయంలో చేలన్నీ పరిగిలి పోయి వున్నందున పశువులన్నింటిని వదిలేస్తారు. ఇలా పశు, పక్షాదులను కనుమ రోజు ఎంతో గౌరవించుకుంటూ ఉండటం.. తెలుగు సాంప్రాదాయాలను గ్రామీణ వాతావరణంలో ఇంక కనిపించడం విశేషం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: