మన భారత దేశంలో సంక్రాంతి పండుగకి ఉన్న ప్రాముఖ్యత ఎంతో ప్రత్యేకం. ప్రతీ ఏడాది సంవత్సరం ఆరంభంలో వచ్చే సంక్రాంతి పండుగతోటే అన్నీ విజయాలు సంతోషాలు, ఆనందాలు మొదలవుతాయి. ప్రతీ ఒక్కరు ఈ పండుగను ఎంతో గొప్పగా, నియమ నిష్ఠలతో పూర్వ కాలం నుండి, మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారాలు, పద్దతులు పాటిస్తూ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. భారత దేశంలోని ప్రజలందరు ఈ సంక్రాంతి ఎపుడెప్పుడు వస్తుందా అని నెల రోజుల నుండే ఆతృతగా ఎదురు చూస్తుంటారు. సంక్రాంతి రోజున వేకువజామున నిద్రలేసి తలంటు స్థానం చేసి తెలుగింటి ఆడపడుచులు వాకిట్లో సింగారంతో ముగ్గులు పెడుతుంటే..పెద్దవారు ఇంటిని తోరణాలతో, బంతి పూలతో అలంకరిస్తారు. 

 

సేమ్య పాయసం, గారెలు, బూరెలు మొదలైన పిండి వంటలు ఆరగించి పనివారికి , రజకులకు ఇంకా ఇంటి పక్కవారికి తాము వండుకున్న పిండివంటల రుచి చూపిస్తారు. ఇక కొత్త అల్లుళ్ళకు అయితే ఈ పండుగ మరీ ప్రత్యేకం .ఎక్కడున్నా సరే భార్యతో అత్తారింటికి వెళ్ళడం ఈ సంక్రాంతి పండుగ ఆనవాయితీ. అలాగే పితృ దేవతలకు ఈ రోజున పితృ తరపనాలు సమర్పిస్తారు. ఇక ఈ పండుగ ఒకెత్తు అయితే ఈ పండుగకు ముందు వెనక వచ్చే పండుగలు మరో ఎత్తు. ఆ పండుగలే భోగి ,కనుమ. ముందుగా భోగి పండుగ సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ. ఈ రోజున అందరూ కుడా వేకువజామున నిద్ర లేచి ఇంట్లో వున్నా పాత సామాను, ఆవు పేడతో చేసిన పిడకలు మొదలైన వాటితో మంటలు వేస్తారు. వీటినే భోగి మంటలు అంటారు. ఆ తరువాత సాయంత్రం సమయంలో బొమ్మలను చక్కగా అలంకరించి బొమ్మల కొలవు ఏర్పాటు చేస్తాం. చంటి పిల్లలున్న వారు రేగి పండ్లు పోసి..ముత్తైదువులందరికి వాటిని పంచుతారు. వీ టినే భోగి పండ్లు అంటాం.

 

ఇక కనుమ పండుగ సంక్రాంతి తరువాతి రోజు వస్తుంది. ఈ రోజు పశువులకు పూజ చేస్తారు. గంగిరెద్దు మేలంవారు గంగిరెద్దులను చక్కగా అలంకరించి ప్రతి ఇంటికి వెళ్లి అయ్యవారికి దండం పెట్టు..అమ్మ వారికీ దందం పెట్టు అంటూ..సన్నాయి వాయిద్యం వాయిస్తూ..గంగిరేద్దులచే లయబద్ధంగా నృత్యం చేపిస్తూ ఆ ఇంటివారు ఇచ్చే కానుకలను అందుకుంటారు. కనుమ పండుగ రోజు తరువాత వచ్చేది ముక్కనుమ మాంసాహారం , మినుప గారెలు వండుకుంటారు. ముఖ్యగా ఈ ముచ్చటైన మూడురోజుల పండుగకు తెలుగు లోగిళ్ళు కలకలలాడుతాయి. ఇదే సంక్రాంతి పండుగ విశిష్టత...ఆ రోజుల్లో పాటించవలసిన పద్దతులు,  నియమాలు. 
   

మరింత సమాచారం తెలుసుకోండి: