ప్రతి యేటా సంక్రాంతికి ప్రజాప్రతినిధులతో సందడిగా ఉండే నారావారి పల్లె ఈ సారి కళ తప్పింది. అమరావతిలో రైతులు, మహిళలు రోడ్లపై ఉద్యమాలు చేస్తుంటే పండగ చేసుకోడానికి మనసు అంగీకరించలేదంటోంది చంద్రబాబు కుటుంబం. నారా, నందమూరి కుటుంబాలు రాకపోవడంతో నారావారి పల్లి బోసిపోయింది. 


 
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రతి సంవత్సరం తన స్వగ్రామంలోనే సంక్రాంతి జరుపుకుంటారు. నారా కుటుంబంతో పాటు బాలయ్య కుటుంబం కూడా నారావారి పల్లెలోనే సంక్రాంతి సంబరాలు చేసుకునేది. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు నారా, నందమూరి అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోటీలు పడి మరీ ఏర్పాట్లు చేసేవారు. దీంతో గ్రామంలో సందడి వాతావరణం కనిపించేది. 

 

గ్రామ దేవత దొడ్డిగంగమ్మకు, కుల దైవం నాగాలమ్మకు పూజలు నిర్వహించే వారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించే వారు. బాబు తల్లిదండ్రులు నారా ఖర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మ సమాధుల వద్ద కూడా నివాళులర్పించేవి ఇరు కుటుంబాలు. గ్రామంలో కలియ తిరుగుతూ అందరనీ ఆప్యాయంగా పలకరించే వారు చంద్రబాబు, నారా భువనేశ్వరి. అలాగే, గ్రామంలో ముగ్గులు, ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసేవారు.

 

గతంలో సీఎం హోదాలో చంద్రబాబు నారావారి పల్లెకు వచ్చినప్పుడు అర్జీలిచ్చేందుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్దఎత్తున చేరుకునే వారు. చాలా సమస్యలు అప్పటికప్పుడే పరిష్కారమయ్యేవి. పోలీసులు, అధికారులు, మీడియా ప్రతినిధులతో హడావిడి కనిపించేది. గత పదేళ్లలో చంద్రబాబు తన స్వగ్రామానికి రాకుండా ఉండటం ఇదే తొలిసారి. నారా భువనేశ్వరి సంక్రాంతికి ముందే వచ్చి గ్రామ దేవత, కులదైవానికి పూజలు చేసి వెళ్లారు. రాజధాని రైతుల కోసం సంక్రాంతి సంబరాలకు దూరంగా ఉండాలని చంద్రబాబు కుటుంబం నిర్ణయించుకుంది. దీంతో నారావారిపల్లె కళ తప్పింది. మొత్తానికి ఈ సంక్రాంతికి నారావారి పల్లె బోసిపోయింది. సాధారణంగా పండుగకు ఒక రోజు ముందు నుంచే సందడిసందడిగా కనిపించే ఆ ఊరిలో హడావిడి లేకపోవడంపై ఏదో తెలియని లోటుగా ఉండిపోయింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: