క‌రోనా వైర‌స్.. ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్నే గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. చైనా.. వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్ వల్ల ఇప్పటికే చాలా మంది చనిపోయారు. మ‌రోవైపు వేల మంది ఆస్పత్రుల్లో ఉన్నారు. చైనాలో తొలుత బయటపడ్డ ఈ వైరస్‌ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరినీ వణికిస్తున్నది. పలు ఇతర దేశాల్లోనూ కరోనా వైరస్‌ కేసులు బయట పడుతున్నాయి. అయితే అసలింతకీ కరోనా వైరస్‌ అంటే ఏమిటి..? అది ఎలా వ్యాప్తి చెందుతుంది..? దీని బారిన ప‌డ‌కుండా ఎలాంటి జాగ్ర‌త్తలు తీసుకోవాలి..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

 

చైనాలోని వుహాన్‌ పట్టణంలోని ‘సీ ఫుడ్‌’ మార్కెట్‌ నుంచి కరోనావైరస్‌ మానవులకు సంక్రమించినట్లు చైనా వైద్యాధికారులు ఇప్పటికే ధ్రువీకరించారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో వారి శాంపిల్స్‌ను లండన్‌కు పంపించి పరిశోధనలు చేపట్టారు. దీంతో పరిశోధకులు వారికి కొత్త వైరస్‌ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. దానికి కరోనా వైరస్‌ అని పేరు పెట్టారు. కరోనా అనేది లాటిన్‌ పదం. కరోనా అంటే కిరీటం అనే అర్థం వస్తుంది. కరోనా వైరస్‌ను ఎలక్ట్రానిక్‌ మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు ఆ సూక్ష్మ జీవులు రాజులు ధరించే కిరీటం ఆకృతిలో పరిశోధకులకు కనిపించాయి. దీంతో ఆ సూక్ష్మ జీవులకు కరోనా వైరస్‌ అని పేరు పెట్టారు. 

 

ఈ వైరస్‌ సోకిన వ్యక్తికి జలుబు, జ్వరం, దగ్గు, ఛాతీలో నొప్పి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. తర్వాత తీవ్రమైన న్యుమోనియాకు దారితీసి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చలికాలంలో ఈ వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. క‌రోనా వైర‌స్ మ‌నుషుల నుంచి మ‌నుషుల‌కే కాక‌, జంతువుల నుంచి మ‌నుషులకు కూడా వ్యాప్తి చెందుతుంది. ఇక ఇప్పటివరకు ఈ వైరస్ వల్ల చనిపోయిన వారంతా ఈ న్యుమోనియా వల్ల మరణించిన వారే. అయితే ఈ వైర‌స్ బారిన పడ‌కుండా ఉండాలంటే.. చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ముక్కు, నోరు దగ్గర తాక‌కూడ‌దు.

 

ఎప్పటికప్పుడు సబ్బుతోని, ఆల్కహాల్‌ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. పచ్చిగా ఉన్నవి లేదా సగం ఉడికిన మాంసం, గుడ్లు తినకూడ‌దు. సరైన సంరక్షణలో లేని జంతువుల వద్దకు వెళ్లరాదు. అలాగే ముక్కు, నోటిని కప్పి ఉంచే మాస్క్‌లు ధరించాలి. వాస్త‌వానికి ఈ వైర‌స్‌కు వాక్సిన్ కూడా లేదు. మామూలుగా దగ్గు, జలుబు, జ్వరానికి వాడే సాధారణ మందులు, కొన్ని ఉపశమన చర్యలను మాత్రమే సూచిస్తున్నారు డాక్టర్లు. సో.. మన రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ... స‌రైన ఆహారం, త‌గు జాగ్ర‌త్త‌ల‌తోనూ ఈ వైర‌స్ బారిన ప‌డ‌కుండా ఉండ‌గ‌లం.

మరింత సమాచారం తెలుసుకోండి: