రహదారులపై ట్రాఫిక్‌ ఆగిపోవడం, కూడళ్ల వద్ద కిక్కిరిసిన వాహనాలు...నగరంలో కనిపించే సాధారణ దృశ్యాలు. నేడు న‌గ‌రాల్లోనే కాదు, చిన్న చిన్న ప‌ట్ట‌ణాల్లోనూ ట్రాఫిక్ స‌మ‌స్య‌లు జ‌నాల‌కు త‌ప్ప‌డం లేదు. రోజు రోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్ స‌మ‌స్య‌కు వాహ‌న‌దారులు స‌త‌మ‌తం అవుతున్నారు. ఇక న‌గ‌రాల్లో అయితే ట్రాఫిక్ బాధ‌లు వ‌ర్ణ‌నాతీతం. ప్రధానంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. బారులు తీరిన వాహనాలు నిత్యం కనిపిస్తుంటాయి.

 

అయితే  ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ట్రాఫిక్‌ రద్దీ ఉన్న నగరాల్లో బెంగళూరు తొలిస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 57 దేశాల్లోని 416 నగరాల్లో నెలకొన్న ట్రాఫిక్ రద్దీపై ఓ సర్వే నిర్వహించిన టామ్ టామ్ అనే సంస్థ అత్యంత రద్దీ నగరం బెంగళూరని తేల్చింది.  దీని ప్రకారం బెంగళూరు వాసులు ట్రాఫిక్‌లో సగటున 71 శాతం ఎక్కువగా సమయాన్ని వెచ్చిస్తున్నట్లు తెలిపింది. అంటే బెంగళూరు వాసులు ఏడాదిలో సగటున 10 రోజుల 3 గంటల పాటు (243 గంటలు) ట్రాఫిక్‌లో గడుపుతున్నట్లు పేర్కొంది. 

 

ఇక టాప్ 10 అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరాల్లో పలు భారత నగరాలు చోటు సంపాదించాయి. ముంబై నాలుగో స్థానంలో, పుణె ఐదొవ స్థానంలో, ఢిల్లీ 8వ స్థానంలో ఉన్నాయి. అలాగే  ట్రాఫిక్‌ రద్దీ ముంబైలో 65 శాతంగా, పుణేలో 59 శాతంగా, ఢిల్లీలో 56 శాతంగా ఉంది. వీటితో పాటు టాప్ టెన్ లో మనీలా, బొగోటా, మాస్కో, లిమా, ఇస్తాంబుల్, జకార్తా నగరాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: