పేద్ద తల... చిన్ని కళ్లు.... గుండ్రటి ముక్కు... చూడగానే హత్తుకోవాలి అనిపించే ‘సుతిమెత్తని’ రూపం.. ప్రేయసి అలకను తీర్చేందుకు ప్రియుడు... పిల్లల మారాన్ని ఇట్టే మాయం చేసేందుకు పెద్దలు.. ఇలా వయస్సుతో సంబంధం లేకుండా ఎవరినైనా ఆకట్టుకునే.. అందరికీ అందుబాటులో ఉండే ముచ్చటైన బహుమతి బుజ్జి ఎలుగుబంటి అదేనండీ టెడ్డీబేర్‌.. వాలంటైన్ వారంలో ఈరోజుని టెడ్డీతో సెలెబ్రేట్ చేసుకుంటారు. అయితే సెలబ్రేషన్ మాట పక్కన పెట్టి, మనం టెడ్డీ కథను తెలుసుకుందాం..

 

1902 నవంబరులో నాటి అమెరికా అధ్యక్షుడు 'థియోడర్ రూజ్‌వెల్ట్'.. మిసిసిపీ, లూసియానాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యని తీర్చడానికి వెళ్లారు. ఈ క్రమంలో వేటకు వెళ్లిన సమయంలో అక్కడి ప్రజలు ఆయనకు ఓ గాయపడిన ఎలుగుబంటిని బహూకరించారు. చెట్టుకు కట్టేసి దానిని కాల్చాలని కోరారు. అయితే బుజ్జి పిల్ల అయిన ఆ ఎలుగుబంటి ప్రాణాలు తీయడానికి రూజ్‌వెల్ట్‌కు మనసొప్పక.. జాలితో దానిని విడిచిపెట్టేశారు. ఈ సంఘటన గురించి 'క్లిఫార్డ్ బెర్రీమ్యాన్' అనే కార్టూనిస్టు చక్కని కార్టూన్ రూపొందించారు.

 

ఓ పత్రికలో ప్రచురితమైన ఈ కార్టూన్‌ ఆధారంగా బొమ్మల షాపు యజమానులు రోజ్‌, మోరిస్‌ మిచ్‌టమ్‌ ఎలుగుబంటి బొమ్మను తయారు చేసి అధ్యక్షుడి అనుమతితో దానికి ‘టెడ్డీబేర్‌’ అని నామకరణం చేశారు. ఈ విధంగా ‘నిన్ను నేను సంరక్షిస్తాను’ అనే భావనకు ప్రతిరూపంగా ‘టెడ్డీ బేర్’  అనే బొమ్మ ప్రపంచానికి పరిచయమైంది. జాన్‌ వాల్టర్‌ అనే అమెరికన్‌ మ్యూజిక్‌ కంపోజర్‌, 1907లో 'ది టెడ్డీ బియర్స్‌ పిక్‌నిక్‌' అనే పాటను రాశారు. ఎంతో హృద్యంగా సాగిపోయే ఈ పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంది. 

 

ఆ తర్వాత 1932లో 'జేమ్స్‌ కెన్నడీ' మరో రైటర్‌ ఇదే పాటను కాస్త మార్చి చిన్నారుల గుండె తాకేలా కంపోజ్‌ చేశారు. ఇక అప్పటి నుంచి టెడ్డీబేర్స్‌ సాంగ్‌ను దాదాపుగా టాప్‌ మ్యూజిషియన్స్‌ అందరూ.. సరికొత్తగా రూపొందించడం మొదలుపెట్టారు. కొన్ని దశాబ్దాల పాటు శ్రోతలను అలరించిన ఈ పాట అందరి మనుస్సుల్లో చెరగని ముద్ర వేసింది. సో ఇదండీ.. సెలబ్రేషన్ చేసుకునే ముందు, బుల్లి టెడ్డీ గురించి తెలుసుకొని చేసుకుంటే, ముఖ్యంగా మీ ప్రేయసికి ఈ కథను వివరించి చెబితే ఇక అంటే.. అమ్మడు పడిపోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: