సోషల్ మీడియా... ఒక పద్ధతి ప్రకారం ఉంటే వచ్చే సమస్య ఏమీ లేదు గాని అది శృతి మించితే మాత్రం వచ్చే సమస్యలు చాలానే ఉంటాయి. ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, విద్యార్ధులు, వ్యాపారులు ఇలా ఎవరు అయినా సరే సోషల్ మీడియా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక పెళ్లి అయిన వాళ్ళు అయితే సోషల్ మీడియాను కేవలం ఒక వినోదంగా చూస్తే బాగానే ఉంటుంది గాని, ఇష్టం వచ్చినట్టు వాడితే మాత్రం భవిష్యత్తు నిప్పుల గుండంలో ఉన్నట్టే. ఈ మధ్య దీని వాడకం అనేది క్రమంగా పెరిగిపోయింది.

 

టిక్ టాక్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్ ఈ నాలుగు కూడా జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. వీటితో పాటు మరికొన్ని ఉన్నా సరే ఇవి ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి అనేది వాస్తవం. టిక్ టాక్ వీడియో కోసం భర్తకు కూరా కూడు వండిపెట్టడం లేదు భార్యలు. ఫేస్బుక్ స్నేహాల కోసం ఫోన్ పట్టుకుని చాటింగ్ చేయడం కామెంట్స్ పెట్టడం కోసం భార్యతో ప్రేమగా మాట్లాడటం లేదు భర్తలు. ఉదయం అంతా ఉద్యోగమో, వ్యాపారమో ఏదొకటి చేసుకుని బిజీగా ఉంటూ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో గడిపేస్తున్నారు. 

 

ఈ మధ్య సోషల్ మీడియా పరిచయాలు ఇళ్ళ వరకు వస్తున్నాయి. సోషల్ మీడియాలో పరిచయం అయిన వాళ్లకు వ్యక్తిగత జీవితాలను మొత్తం విప్పి చెప్పేస్తున్నారు. ఫేస్బుక్ పరిచయాలకు ఆర్ధిక సహాయాలు చేస్తున్నారు. భర్తలకు తెలియకుండా భార్యలు ఆర్ధిక సహాయ౦ చేయడం, భార్యకు చీర కొనని భర్త, ఆత్మీయ సమావేశాల పేరుతో మరో స్త్రీకి చీరో, వాచీనో గిఫ్ట్ గా ఇస్తాడు. వీటి వలన సమస్యలు పెరగడమే గాని తగ్గడం ఉండదు. ఇంట్లో విలువ ఇవ్వని వాడు వీధిలో ఇచ్చేది ఏముంటుంది చెప్పండి. కాబట్టి సోషల్ మీడియా అనేది మొబైల్ వరకు పరిమితం చేస్తే బాగానే ఉంటుంది. లైక్స్ కోసం, కామెంట్స్ కోసం మరొక దాని కోసం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కొంపలు ఆరిపోవడమే. మీ పిల్లలు రోడ్డున పడటమే.

మరింత సమాచారం తెలుసుకోండి: