జీవితంలో ఆనందానికి అహానికీ పూర్తి వ్యతిరేకత ఉంటుంది. అహం పెరిగితే ఆనందం తగ్గిపోతుంది. అహం లేని చోట ఆనందం వెల్లివిరుస్తుంది. అహానికి చెక్ పెట్టాలంటే.. దాసత్వం అలవాటు చేసుకోవాలి. దాసత్వం అంటే బానిసత్వం కాదు సుమా.

 

దాసత్వం అంటే అహం వదిలి దేవును గొప్పదానాన్ని అంగీకరించడం.. నవవిధ భక్తి మార్గాల్లో దాస్యానికి సముచితమైన స్థానం ఉంది. నమ్రతా భావంతో కూడిన వినయ విధేయతల త్రివేణీ సంగమంతో సమానమైనది దాస్య భక్తి.

 

నిజమైన హరిదాసుడు దాసోహం అనడానికి, అలా కావడానికి ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటాడు. తన అస్తిత్వాన్ని పోగొట్టుకుని పరతత్త్వంలో లీనం కావడానికి పాలలో పంచదారగా మారాలి. దాసుడికి అది ఒకరకమైన విముక్తి దశ. అయితే దీనికి అహంకారం బండరాయిలా ఎప్పటికప్పుడు అడ్డుతుంటుంది.

 

దాసుడికి భగవంతుడు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాడు. రామదాసు అన్న పేరు మన దేశంలో మిక్కిలి జనప్రియమైన నామం. రామదాసు అంటే రామబంటు- హనుమంతుడు. ఈ పేరులో రాముడు తప్ప మనకు హనుమంతుడు కనిపించడు. ఆ పదాన్ని విడదీసి శల్యపరీక్ష చేస్తేగాని అందులో దాగిన దాసుడు- ఆంజనేయుడు బయటికి రాడు.

 

తులసీదాసు తులసికి దాసుడు శ్రీమహావిష్ణువు. తులసిలో కలిసి ఉన్న ఆ పరమాత్మను స్మరించడానికి, మనోనేత్రంతో దర్శించడానికి ‘కృష్ణ తులసి అన్న ప్రయోగం మనకు ప్రయోజనకరంగా కలిసి వస్తుంది. రుక్మిణి ఒక్క తులసిదళంతో కృష్ణ తులాభారంలో నెగ్గింది.

మరింత సమాచారం తెలుసుకోండి: