జీవితం ఓ ప్రయాణం.. హాయిగా సాగనీ అంటాడో సినీరచయిత.. సినిమా పాటలకేంగానీ.. నిజానికి జీవితం అంత సాఫీగా సాగదు. ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. అయితే వీటన్నింటినీ ఎదుర్కోవాలంటే గుండె ధైర్యం కావాలి. మరి ఆ గుండె ధైర్యం ఎలా వస్తుంది.. అందుకు ఏం చేయాలి..?

 

ఇది చాలా జఠిలమైన ప్రశ్నే కానీ.. సమాధానం అసాధ్యం కాదు. గుండె ధైర్యం రావాలంటే ముందు అజ్ఞానం పోవాలి. మూఢ నమ్మకాలు పోవాలి.. అంధ విశ్వాసాలు దరి చేరకూడదు. అందుకు ఉన్న ఒకే ఒక్క మార్గం.. ప్రశ్న.. రెండక్షరాల పదమే కానీ సముద్రమంత లోతున్న పదం ఈ ప్రశ్న.

 

ప్రశ్న అనేది చక్కని పంట అందించే విత్తనం లాంటిది. ఒక్క బీజం ఎన్నో ఫలాలనిచ్చి అనేకుల ఆకలి తీర్చినట్లే.. అలాగే ఒకే ఒక్క ప్రశ్న అపారమైన జ్ఞానతృష్ణకు అంకురార్పణ చేస్తుంది. ఫలితంగా ఎన్నెన్నో నూతనావిష్కరణలు పురుడు పోసుకుంటాయి.

 

శక్తిమంతమైన విత్తనాన్ని సంచుల్లోనే శాశ్వతంగా బంధించి వేయకూడదు. అలా చెయ్యడం సహజంగా జరిగే ప్రాకృతిక నియమాలకు విఘాతం కలిగించడమే అవుతుంది. ఎదిగే క్రమాన్ని అణచివేయడం, స్వేచ్ఛను హరించివేయడం లాంటి దుశ్చర్యలకు ఆధ్యాత్మిక క్షేత్రంలో చోటులేదు.

 

 

అలా ప్రశ్నిస్తూ పోతే.. జ్ఞానం పెరుగుతుంది. పెరిగిన జ్ఞానం మనపై మనకు నమ్మకాన్నిస్తుంది. అదే మీకు కొండంత అండ.. గుండె ధైర్యం. అందుకే జీవితంలో ఎదగాలంటే ముందు ప్రశ్నించడం నేర్చుకోండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: