త‌ల్లి బిడ్డ‌కు ఎవ్వ‌రూ పంచ‌లేనంత ప్రేమ‌ను పంచుతుంది. పాత కాలంలో త‌ల్లులు ఇళ్ళ‌లోనే ఉండేవారు. దాంతో త‌ల్లి ప్రేమ పిల్ల‌ల‌కు అర్ధ‌మ‌య్యేది. ప్ర‌తి విష‌యంలోనూ త‌న బిడ్డ‌కు ఏం కావాల‌న్నా తానే ద‌గ్గ‌రుండి చూసుకునేది. ఉద‌యం లేచాక పాలుప‌ట్టించే ద‌గ్గర నుండి రాత్రి నిద్ర‌పుచ్చేవ‌ర‌కు బిడ్డ త‌ల్లి ఒడిని వ‌దిలేవాడు కాదు. బిడ్డ ఆడుకునే స‌మ‌యం, వాడి ఆహార‌పు అల‌వాట్లు ఇవన్నీ గ్ర‌హించుకుంటూ కంటికి రెప్ప‌లా కాపాడుకుంటుంది. స‌మ‌యానికి భ‌జ‌నం పెట్ట‌డం టైమ్‌కి నిద్ర పుచ్చ‌డం మారాం చేస్తే లాలించ‌డం ఇవ‌న్నీ ఒక‌ప్పుడు త‌ల్లులు త‌మ బిడ్డ‌ల‌కు చేసిన ప‌నులు. కానీ నేటి త‌రం మోడ్ర‌న్ త‌ల్లులు ఇవేమి ప‌ట్టించుకోవ‌డం లేదు. అంటే వారికి బిడ్డ మీద ప్రేమ లేక కాదు. ప్ర‌స్తుతం రోజులు మారాయి. అంతా క‌ష్ట‌కాలం. ఒక‌ప్పుడు ఒక‌రు సంపాదిస్తే ఇంట్లో మిగిలిన వారంతా కూర్చుని తినేవారు. ఇప్పుడు అలా కాదు భార్యా భ‌ర్త‌లు ఇద్ద‌రూ సంపాదించాల్సి ఉంటుంది.

 

దానికి తోడు ల‌గ్జరీ లైఫ్‌కి అల‌వాటుప‌డిన వారు మ‌రి ఇంకాస్త బిజీగా ఉంటారు. ఉద‌యం లేవ‌డం ఏదో వండుకోవ‌డం పిల్లాడికి స్నానం చేయించ‌డం. డ‌బ్బాలో పాలు పొయ్య‌డం ఏదో వాడు తినే ఆహారం, బిస్కెట్‌, లేదా బ్రెడ్ ఇలా ఏదో ఒక‌టి ఇచ్చి ఇంట్లో ఆయ‌మ్మ‌ల‌కో లేదా పెద్ద‌వాళ్ళు ఎవ‌రైనా ఉంటే వారికి అప్ప‌జెప్పి వెళ్ళిపోతున్నారు. మ‌రికొంద‌రైతే వారికి ఇంట్లో చూసుకునే పెద్ద‌వారు లేక‌పోతే ప్లేస్కూల్‌, డేకేర్ సెంట‌ర్ల మీద ఆధార‌ప‌డుతున్నారు. వాళ్ళు స‌ంపాదించిన దాంట్లో పావు వంతు వాటికే పెట్టేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే... వారు అలా పెట్టి వెళ్ళ‌డం వ‌ల్ల బిడ్డకి త‌ల్లి పైన బెంగ ఎక్కువ‌గా ఉంటుంది. కానీ పాపం వారు నోరు విప్పి చెప్ప‌లేని పరిస్థితి.

 

ఎప్పుడో ఆఫీస్‌కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వెళ్లే స‌మ‌యంలో వారిని పిక‌ప్ చేసుకుని ఇళ్ళ‌కు వెళ‌తారు. ప‌గ‌లంతా అక్క‌డ ఉండ‌డంతో వారి ఆల‌న పాల‌న వేరే వాళ్ళ చేతికి వెళుతుంది. దాంతో మంచి కావొచ్చ చెడు కావొచ్చు వారు ఎలా చూసినా కూడా పాపం ఆ బిడ్డ‌ల‌కీ భ‌గ‌వంతుడికి త‌ప్ప త‌ల్లికి అర్ధంకాదు. మ‌రి ఇలాంటి ప‌రిస్థితులు నేటి త‌ల్లుల్లో ఎక్కువ‌గా క‌న‌ప‌డుతుంది. అలాగే మ‌రి కొంత మంది త‌ల్లులైతే పాలు ఇవ్వ‌డం వ‌ల్ల వారి శ‌రీరాకృతి పాడ‌వుతుంద‌ని త‌ల్లి పాలు కూడా ఇవ్వడం లేదు. చిన్న‌ప్ప‌టి నుండే డ‌బ్బా పాలు అల‌వాటు చేసేస్తున్నారు. దీని వ‌ల్ల చాలా ఆరోగ్య స‌మ‌స్యలు కూడా ఎదుర‌వుతాయి. ఇవ‌న్నీ ఈ త‌రం త‌ల్లులు గ్ర‌హించుకుంటే బావుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: